అద్దెరి పోయే షికారు | Sakshi
Sakshi News home page

అద్దెరి పోయే షికారు

Published Sun, Apr 24 2016 2:57 AM

అద్దెరి పోయే షికారు - Sakshi

సినిమాలో  హీరోహీరోయిన్ జంటగా లాంగ్ డ్రైవ్‌కి దూసుకుపోవడం చూస్తుంటే.. అబ్బ అలాంటి కార్లు, బైక్‌లలో ఒక్కసారైనా  రయ్‌మని రైడ్‌కి వెళ్లాలని కలల్లో తేలిపోతారు.  అయితే, ఆ కల సాకారం  చేసుకోవాలంటే రూ.లక్షలు, కోట్లలో పని. అందుకే  అది మధ్య తరగతి మనిషికి తీరని కలగానే  ఉండిపోతోంది. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేయడానికి నగరంలో ఓ అద్భుతమైన  అవకాశం అందుబాటులోకి వచ్చింది.     

కార్లు, బైక్‌లు అద్దెకివ్వడమనేది కొత్త విషయం కాదు. అయితే అరుదైన, అత్యంత ఖరీదైన విదేశీ వాహనాలు సైతం అద్దెకు అందుబాటులోకి రావడం మాత్రం సిటీజనులకు కొత్తగా పరిచయమైంది. ఇటీవల గచ్చిబౌలిలో ఏర్పాటైన ‘డ్రైవ్ ఇన్ కేఫ్’ సిటీజనుల ఖరీదైన కలల రైడ్‌ను సాకారం చేస్తోంది. దేశంలోనే ఇది మొట్టమొదటి ఆటో మొబైల్ కేఫ్ అని నిర్వాహకులు చెబుతున్నారు.

కార్లు, బైక్‌లు, సైకిళ్లూ...
ఈ కేఫ్‌లో రూ.కోట్లు విలువ చేసే కార్లతో పాటు రూ.లక్షలు విలువ చేసే సైకిళ్లూ అద్దెకిస్తున్నారు. గంట, రోజుల చొప్పున కూడా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. ఆడీ, బీఎండబ్ల్యూ, బెంజ్, ఫెరారీ, ఓపెన్ టాప్.. లాంటి హైప్రొఫైల్ లగ్జరీ కార్లు అద్దెకివ్వడం ఇక్కడి విశేషం. టాటా నానో కార్ మొదలుకొని రెండు కోట్లు విలువ చేసే పార్చీ కెరేరా వరకు వీరి జాబితాలో ఉన్నాయి. అద్దెలు రోజుకి రూ.300 నుంచి రూ.30,000 వరకు ఉన్నాయి. అలాగే యాక్టివా బైక్ నుంచి ట్రయంఫ్ రాకెట్ వరకు రూ.300 నుంచి రూ.12 వేల అద్దెల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ.75,000 నుంచి రూ.3 లక్షలు ఖరీదున్న సైకిళ్లు సైతం అద్దెకిస్తున్నారు. 

త్వరలో విశాఖ, విజయవాడల్లోనూ..
వాహనం అద్దెకిచ్చే ముందు సెక్యూరిటీ కోసం లెసైన్స్, ఆధార్, క్రెడిట్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వాహనం నడిపే విధానం, ఇక్కడి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎలా నడపాలి.? ఇలా అన్ని నేర్పిస్తారు. బైక్ నడపడానికి తగ్గ జాకెట్, హెల్మెట్లు సైతం ఇస్తారు. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈ కేఫ్ ప్రారంభించనున్నామని దీని ప్రమోటర్స్ అశ్విన్‌జైన్, ఖరార్ తాహెర్, నబెల్ హుస్సేన్, హుస్సేర్‌లు తెలిపారు. అంతే కాకుండా ఢిల్లీ, గోవా, బెంగళూర్, చెన్నై, జైపూర్, సిమ్లా, కోల్‌కతా నగరాల్లోనూ సైతం మూడు వేల కార్లు, 1500 బైక్‌లతో విస్తరిస్తున్నామన్నారు.

ఎవరి బర్త్‌డేకి అయినా డోర్ తెరవగానే ఇంటి ముందు రేసింగ్ బైక్ లేదా ఫెరారీ కార్ ఉండి, దానిపై ఫ్లవర్ బొకే, కేక్‌తో సహా సినిమాల్లో లాగా సెట్ చేసి ఆశ్చర్యపరిచే గిఫ్ట్స్ కూడా వీరు అందుబాటులో ఉంచారు. తమకు కాల్ చేసి కాన్సెప్ట్, డేట్, టైం చెప్తే సరి.. వారు అనుకున్న ప్రకారం ఆశ్చర్యపరిచే గిఫ్ట్స్ పంపే అవకాశాలూ అందుబాటులో ఉన్నాయని దీని ప్రమోటర్స్ చెప్పారు.
 - శిరీష చల్లపల్లి

Advertisement
Advertisement