ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా భర్తీ! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా భర్తీ!

Published Wed, Jun 8 2016 12:23 AM

ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా భర్తీ! - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ కోటా తరహాలో ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని 30% మేనేజ్‌మెంట్ కోటా (ఇందులో 15% ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్) సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. మెరిట్ ప్రకారమే ఈ సీట్లను భర్తీ చేస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నా... డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు ఇస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కాలేజీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ప్రకారం కేటాయించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే దరఖాస్తులను కాలేజీలు స్వీకరించినా ఆ లింకు ఉన్నత విద్యాశాఖకూ ఉంటుంది. కేటాయింపుల్ని కాలేజీలు కాకుం డా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో చేపడతారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. మరోవైపు ప్రభుత్వం సీజీజీ నేతృత్వంలో మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించినా... కోర్టు ఆదేశాల ప్రకారం ఆ కాలేజీకి నిర్ధారించిన ఫీజును చెల్లించే స్తోమత విద్యార్థికుందా లేదా అన్నది తెలుసుకునే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. దీన్ని సాకుగా చూపి డొనేషన్లు ఇవ్వని విద్యార్థులకు సీట్లు నిరాకరించే పరిస్థితి ఉంటుందని.. ఈ విషయంలో ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

 22 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేనా?
 కన్వీనర్ కోటాలోని 70% ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభించడం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఉన్నత విద్యామండలికి అందాల్సి ఉంది. గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసింది. విజిలెన్స్ విభాగమూ కాలేజీల్లో తనిఖీలు చేస్తోంది. ఇవి ముగిసి నివేదికలు వస్తే.. వాటిని జేఎన్టీ యూ నివేదికలతో పోల్చి చూశాకే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు మరింత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంటే ఈ నెల 22 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కావడం కష్టమేనని, జూలై తొలివారం నాటికి కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తామని చెబుతున్నారు.

Advertisement
Advertisement