12 నెలల్లో రూ. 12,143 కోట్లు | Sakshi
Sakshi News home page

12 నెలల్లో రూ. 12,143 కోట్లు

Published Sun, Apr 3 2016 12:55 PM

12 నెలల్లో రూ. 12,143 కోట్లు - Sakshi

- వార్షికాదాయంలో ఎక్సైజ్‌శాఖ కొత్త రికార్డు
- నూరు శాతం ఆదాయ లక్ష్యంలో 99.53 శాతం నమోదు
- 238 లక్షల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, 334 లక్షల బీరు కేసుల విక్రయం

 
 సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాల్లో ఆబ్కారీశాఖ నూతన రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి నూరు శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యంలో ఏకంగా 99.53 శాతం టార్గెట్‌ను సాధించింది. రూ. 12,200 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను నెలకు సుమారు రూ. 1,000 కోట్ల మద్యం అమ్మకాల డిమాండ్‌తో మార్చి 31 నాటికి రూ. 12,143 కోట్లు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 10,238 కోట్ల ఆదాయంకన్నా ఈసారి దాదాపు రూ. 2 వేల కోట్లు అదనంగా అందుకుంది.
 
 కోట్ల కేసుల ఐఎంఎఫ్‌ఎల్, బీర్లు విక్రయం
 రాష్ట్రంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయించే దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), బీర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ప్రాతిపదికగా తీసుకుంటా రు. 750 ఎంఎల్ మద్యంగల 12 సీసాలను ఒక కేస్(పెట్టె)గా విక్రయిస్తారు. ఈ లెక్కన 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి 31 వరకు రాష్ట్రంలో 238 లక్షల కే స్‌ల ఐఎంఎఫ్‌ఎల్‌ను విక్రయించారు. 2014-15లో 148 లక్షల కే స్ లను మాత్రమే విక్రయించగా ఈసారి ఏకంగా 90 లక్షల కేస్‌లు అదనం కావడం గమనార్హం. ఇక బీర్ల విక్రయాల్లో గత ఆర్థిక సంవత్సరం 282 లక్షల కేస్‌లను విక్రయించగా 2015-16లో ఏకంగా 334 లక్షల కేస్‌లు (52 లక్షల కేస్‌లు అదనం) విక్రయించారు. వీటితోపాటు లెసైన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ తదితరాల ద్వారా సమకూరిన మొత్తం రూ. 12.143 కోట్లుగా ఓ అధికారి తెలిపారు.
 
 వ్యాట్ బై ఎక్సైజ్ రూ. 8,160 కోట్లు
 ఎక్సైజ్ శాఖ 12 నెలల కాలంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 12 వేల కోట్లకుపైగా సమకూర్చుకున్నా పన్నులు, ఇతర ఖర్చులు పోగా ఎక్సైజ్ శాఖకు మిగిలింది మాత్రం సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే. మద్యం ద్వారా వచ్చిన రాబడిలో విలువ ఆధారిత పన్ను రూపంలో (వ్యాట్ బై ఎక్సైజ్) రూ. 8,160 కోట్లు (67 శాతం) వాణిజ్యపన్నుల శాఖకు చేరిపోగా సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్‌కు మరో రూ. 222 కోట్లు జమ అయింది. లెసైన్సు ఫీజు కింద రూ. 1,859 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.1,660 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 231 కోట్లు కలుపుకొని ఆబ్కారీ శాఖకు సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే మిగిలింది.

Advertisement
Advertisement