చౌకగా బంగారమంటూ టోకరా | Sakshi
Sakshi News home page

చౌకగా బంగారమంటూ టోకరా

Published Thu, Oct 3 2013 5:30 AM

Rs. 2 crore cheting

నాగోలు, న్యూస్‌లైన్:  తక్కువ ధరకే బంగారం... అధిక వడ్డీ చెల్లిస్తానని చెప్పి ఓ వ్యాపారి దాదాపు రూ. 2 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పారిపోయాడు. ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం... గుజరాత్ రాష్ట్రం కాంచి జిల్లా కొట్టాట గ్రామానికి చెందిన నవీన్‌చంద్ర కిమ్జిసోని, భార్య నీతా, కుమారులు వితిన్‌సోని, డిపుల్‌సోని, శుభమ్‌సోనిలతో కలిసి నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్ శాతవాహననగర్ కాలనీలోని సుధీర్‌నారాయణ్ ఇంట్లో అద్దెకుంటూ... ఇదే ప్రాంతంలో నాలుగు షట్టర్లను అద్దెకు తీసుకొని శ్రీఅశపూర్వ శారీస్, అశపూర్వ జ్యువెలెర్స్ పేరిట షాపులను ప్రారంభించాడు.

స్థానికులతో ఇతని కుటుంబం మొత్తం కలిసి మెలిసి ఉండేది. తక్కువ ధరకు బంగారు బిస్కెట్‌లు ఇస్తామని నవీన్‌చంద్ర ప్రచారం చేశాడు. ముందు తమకు డబ్బు చెల్లిస్తే 4 నెలల తర్వాత బంగారం ఇస్తామని షరతు పెట్టేవాడు. మొదట్లో కొందరికి సమయానికే బంగారం ఇచ్చాడు. దీంతో ఇతనిపై నమ్మకం కుదిరి స్థానికులు పెద్ద ఎత్తున బంగారం కోసం డబ్బు ఇచ్చారు. ఇదే సమయంలో ఇతను మరికొందరి నుంచి అధిక వడ్డీ చెల్లిస్తానని డబ్బు అప్పుగా తీసుకున్నాడు. వీరిలో కొందరికి రశీదులు, మరికొందరికి చెక్కులు ఇచ్చాడు.

ఇదిలా ఉండగా, ఐదు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్య,పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు.  తన షాపులో పనిచేసే వారు ఫోన్ చేయగా.. రెండు రోజుల్లో వస్తామని చెప్పాడు. బంగారం కోసం డబ్బులు ఇచ్చిన వారు ఫోన్లు చేయడం స్వీచ్చాఫ్ చేశాడు. మూడు రోజులైనా నవీన్‌చంద్ర, అతని కుటుంబ సభ్యులు తిరిగి రాకపోవడం, ఫోన్లు పని చేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బుధవారం ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన వారిలో ఇంటి యజమాని సుధీర్‌నారాయణ్ తో పాటు మరికొందరు ఉన్నారు.

ఇంటి యజమాని వద్ద రూ. 8 లక్షలు, ఇదే ప్రాంతానికి చెందిన ఇందిర వద్ద బంగారం ఇస్తానని రూ. 9 లక్షలు, కర్మన్‌ఘాట్‌కు చెందిన సదానందరెడ్డి వద్ద రూ. 7 లక్షలు, నర్సింహ్మ నుంచి రూ. 5 లక్షలు, కరుణ నుంచి రూ.8 లక్షలు, వడ్డీకి పటేల్ వద్ద రూ.5 లక్షలు, ఇందిరారెడ్డి వద్ద రూ. 6 లక్షలు నవీన్‌చంద్ర తీసుకున్నాడు. ఇతని బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, బంగారం ఇస్తానని సుమారు రూ. 2 కోట్లకు పైనే వసూలు చేశాడని ఫిర్యాదు చేసిన వారు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement