పనికిమాలిన ఫర్నిచర్‌కు రూ.5 కోట్లు | Sakshi
Sakshi News home page

పనికిమాలిన ఫర్నిచర్‌కు రూ.5 కోట్లు

Published Tue, Dec 31 2013 4:07 AM

Rs 5 crore for the tacky furniture

సాక్షి, సిటీబ్యూరో:. కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో జలమండలి ప్రధాన కార్యాలయంలో ఫర్నీచర్ కొనుగోళ్లు నిరూపించాయి. మూడేళ్ల క్రితమే ఫర్నిచర్, ఇంటీరియర్స్, అల్మారాలు కొనుగోలుచేసినా.. ఇప్పుడవి ఎందుకూ పనికిరాకుండా పోయా యి. నాసిరకం ఫర్నిచర్ కావడంతో... ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తఫర్నీచర్ కొనాల్సిన దుస్థితి నెలకొంది.

ఓ ప్రముఖ ఫర్నిచర్ కంపెనీవని నమ్మిస్తూ ఆ కంపెనీ లేబుల్ అతికించిన నాసిరకం స్థానిక ఫర్నిచర్ (లోకల్‌మేడ్)ను ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం అవసరాల కోసం కొనుగోలు చేసినట్లు తాజాగా బయటపడడం సంచలనం రేపింది. ఓ ఉన్నతాధికారి కనుసన్నల్లో మూడేళ్ల క్రితం రూ.5 కోట్లు వెచ్చించి నాణ్యత లేని ఈ ఫర్నిచర్ కొనుగోలుచేశారు. ఈ విషయంపై బోర్డు అధికారులు ఆరా తీస్తే... డొంక కదులుతోంది. ఈ ఫర్నిచర్‌ను బషీర్‌బాగ్‌లోని ఓ ఏజెన్సీ (స్థానిక కంపెనీ) తయారు చేసినవని తేలింది. తెలివిగా సదరు కంపెనీ ఓ ప్రముఖ కంపెనీ లేబుల్‌ను అతికించి జలమండలికి... కోట్ల విలువైన ఫర్నిచర్‌ను అంటగట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో అధికారులు ఖంగుతిన్నారు.
 
నాసిరకమే...
 
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మొత్తం ఐదంతస్తులున్నాయి. మేనేజింగ్ డెరైక్టర్ చాంబర్, పేషీతో పాటు టెక్నికల్, ఫైనాన్స్,ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కార్యాలయాలు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్ల చాంబర్లు, పేషీలు, యాంటీ, వెయిటింగ్ రూమ్‌లకు అవసరమైన టేబుళ్లు, కంప్యూటర్, కాన్ఫరెన్స్‌హాల్ ఫర్నిచర్, విలాసవంతమైన కుర్చీలు, సోఫాలు, టీపాయ్, అల్మారాలు, గాజుతో తయారు చేసిన అలంకరణ సామాగ్రిని మూడేళ్ల క్రితం పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు.

వీటిలో ఇపుడు సగానికి పైగా చెడిపోవడంతో వాటిని మార్చాల్సిన పరిస్థితి ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ బాగోతంలో కొందరు అధికారుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. సదరు కంపెనీ నుంచి వారికి భారీగానే కమీషన్లు ముట్టాయని, జలమండలి ప్రధాన కార్యాలయం నిర్మాణంలోనూ సదరు అధికారి చేతివాటం ప్రదర్శించారని కార్మికసంఘాలు ఆరోపిస్తుండడం గమనార్హం. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నాయి.
 

Advertisement
Advertisement