అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం | Sakshi
Sakshi News home page

అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం

Published Wed, May 3 2017 12:48 AM

అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం

ఆలయాల ఉద్యోగులకు కూడా...
- ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు
- గ్రామాల్లో రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10–12 వేల వరకు
- ఆలయ నిధులు సరిపోకుంటే ప్రభుత్వ గ్రాంటుతో భర్తీ
- మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ నిధులు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలను మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలుగా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతి పాదించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల అంశంపై ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యం లో నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ప్రభుత్వానికి ప్రతి పాదనలు సమర్పించింది. మంగళవారం తుది దఫా భేటీ అయి ప్రభుత్వానికి మరిన్ని సిఫార్సులు చేయనుంది.

చాలా కాలంగా ఎదురుచూపులు
తగిన ఆదాయం లేని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు ప్రస్తుతం నామమా త్రపు వేతనాలే అందుతున్నాయి. దాంతో తమ జీవనం దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లడంతో.. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ సబ్‌ కమిటీ అర్చకులు, ఉద్యోగులు, దేవా దాయశాఖ అధికారులతో పలు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే దేవాలయాల్లోనూ కనీస వేతనాలు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. అయితే ఓ పద్ధతంటూ లేకుండా, అర్హతలేమీ పట్టించుకోకుండా పాలక మండళ్లే అర్చకులు, ఉద్యోగుల నియామకాలు చేస్తున్నందున.. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ గుర్తించిన ఆలయాలకే కనీస వేతనాలను పరిమితం చేశారు.

3,300 మందికి లబ్ధి
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,500 వరకు ఆల యాలు ఉన్నాయి. వాటిలో కనీస వార్షికా దాయం రూ.50 వేలు, ఆపైన ఉన్న ఆలయా లుగా దేవాదాయశాఖ గుర్తించినవి 650 వరకు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ఈవోలు, క్లర్కులను నియమించి పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయాలన్నింటిలో కలిపి 6 వేల మంది అర్చకులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2,700 మంది ఎక్కువ ఆదాయమున్న ఆలయాల్లో నిర్ధారిత స్కేల్‌కు సమంగా వేతనాలు పొందుతున్నారు. మిగతా 3,300 మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది.

ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం
గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో తాత్కాలిక పద్ధతిలో (రోజుకు మూడు నాలుగు గంటల పాటు) పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రూ.8 వేలు... పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.10 వేలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక పట్టణ ప్రాంతా ల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.12 వేలు చొప్పున చెల్లించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం వీరందరి వేతనాల కింద ఆయా దేవాలయాలు రూ.28 కోట్లు చెల్లిస్తున్నాయి. ఇప్పుడా మొత్తం సుమారు రూ.68 కోట్లకు పెరగనుంది. అంటే మిగతా రూ.40 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇచ్చే నిధి నుంచి చెల్లిస్తారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లిం చాలనే విషయాన్ని దేవాదాయ శాఖ త్వరలో సర్వే చేసి నిర్ధారిస్తుంది.

మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’
కొత్తగా మరో 1,200 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కిందకు తేవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ పథకం కింద ఆ ఆలయాలకు నెలకు రూ.6 వేలు చొప్పున అందజేస్తారు. ప్రస్తుతం 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇక ఆలయాల భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని.. అన్ని ఆలయాల కైంకర్యాల వివరాలను భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక నుంచి కమిషనర్‌ అనుమతి లేకుండా ఆలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకుండా నిబంధన తీసుకురావాలని, వారసత్వ అర్చక నియామకాలను చట్ట ప్రకారం చేపట్టాలని, సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చే డిక్రీ తరహాలో దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ ఇచ్చే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ప్రతిపాదించింది. ఆలయాల్లో ఖాళీల భర్తీ, వీలైనంత త్వరలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలని సూచించింది.

అర్చకులు, ఉద్యోగుల హర్షం
ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలన్న మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ కన్వీనర్‌ గంగు భానుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలాకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఇక మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు మంత్రులను కలసి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement