‘అద్దె’ మింగిన వారికి అందలం! | Sakshi
Sakshi News home page

‘అద్దె’ మింగిన వారికి అందలం!

Published Tue, May 17 2016 3:42 AM

‘అద్దె’ మింగిన వారికి అందలం!

♦ అభియోగాలున్న అధికారులను తప్పించిన వైనం
♦ స్వాహా చేసిన 2 కోట్ల రికవరీలో మౌనం
♦ ఆర్టీసీలో అక్రమార్కులకు తెర వెనక అండ
 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అక్రమార్కులదే రాజ్యం.. నిధులు స్వాహా చేసినా వారిపై చర్యలుండవు. పైగా పదోన్నతులతో అందలమెక్కిస్తారు. దీంతో ఇతర అధికారుల్లో భయం లేకుండా పోయింది. ప్రతి డిపో పరిధిలో ఆడిట్, ఆర్టీసీకి సొంతంగా విజిలెన్స్ విభాగం ఉన్నా యథేచ్చగా అక్రమాలు జరగడానికి ఉదాసీనతే కారణం. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న దుకాణాల అద్దెలు వసూలు చేసి ఖజానాకు జమ చేయకుండా జేబులో వేసుకుని సంస్థకు కన్నం వేసిన అధికారులను ఎలాంటి చర్యలు లేకుండా తప్పించడం చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ చేసి తాత్కాలిక పద్ధతిపై అద్దెలు వసూలు చేస్తున్న వారిని తప్పించి ఆర్టీసీ యాజమాన్యం చేతులు దులుపుకొంది. ఈ కుంభకోణంలో అభియోగాలు నమోదైన అధికారులకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ప్రస్తుతం రోజుకో రకమైన అవినీతి బాగోతం చోటుచేసుకుంటోంది.

 మరి స్వాహా అయిన నిధుల సంగతేంటి...?
 ఆదాయం కోసం బస్టాండ్లలో దుకాణాలను ఆర్టీసీ అద్దెకిస్తోంది. నెలనెలా వసూలయ్యే మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. ఈ అద్దెల వసూలుకు రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందిని నియమించింది. వివిధ డిపోల పరిధిలో దాదాపు రూ.2 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన సిబ్బంది బ్యాంకుల్లో జమ చేయలేదనే విషయం గతంలో వెలుగుచూసింది. దీనిపై అప్పట్లో విచారణకు ఆదేశించగా, రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది.. ఈ వ్యవహారంలో అధికారుల హస్తముందని తేల్చింది. 15 మంది అధికారులు, సిబ్బందిపై అభియోగాలు కూడా నమోదు చేశారు.

వెంటనే అద్దెలు వసూలు చేస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేసిన ఆర్టీసీ.. అసలు కారకులైన అధికారులపై నాన్చుడు ధోరణి ప్రారంభించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్లీ విచారణ అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఆ కేసు మరుగునపడే వరకు వేచి చూసి ఆ అధికారుల పేర్లను గుట్టుచప్పుడు లేకుండా తప్పించింది. ఓ ఉన్నతాధికారికి క్లీన్‌చిట్ ఇచ్చి మరీ పదోన్నతి కల్పించి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టింది. మిగతా అధికారులను కూడా పదోన్నతులు, బదిలీలతో సీట్లు మార్చేసింది.

చిన్నచిన్న ఆరోపణలతో డ్రైవర్లు, కండక్టర్లను సస్పెండ్ చేస్తున్న ఆర్టీసీ.. రూ.2 కోట్ల కుంభకోణంలో మాత్రం అధికారులకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 7 బస్లాండ్లకు సంబంధించి కొత్త దుకాణ స్థలాలను కేటాయించేందుకు టెండర్లు పిలవగా మంచి స్పందన వచ్చింది. నెలకు రూ.10 లక్షల అద్దె వచ్చే అవకాశానికి స్వయంగా కొందరు అధికారులే అడ్డు తగులుతున్నారు. స్థలాలను అప్పగించకుండా వేరే అద్దె దుకాణాలదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement