ఊరికి దారేది? | Sakshi
Sakshi News home page

ఊరికి దారేది?

Published Tue, Oct 1 2013 4:45 AM

ఊరికి దారేది? - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : రైళ్లు ఫుల్... ఆర్టీసీ బస్సులు నిల్... ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ... వెరసి దసరా పండక్కి సొంతవూరు వెళ్లాలనుకునేవారికి దిక్కుతోచని పరిస్థితి. మరో మూడు రోజుల్లో పిల్లలకు దసరా సెలవులు. పండగ సందర్భంగా ఇంటిల్లిపాదీ కలిసి సొంతవూరు వెళ్లాలనుకుంటున్న నగర వాసుల ఆశలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి.

అరవై రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటి కే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. పండక్కి మరింత పక్కాగా దోపిడీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు అవకాశం లేక, రైళ్లలో బెర్తులు లభించక చాలామంది ప్రయాణాలు విరమించుకొంటున్నారు. పిల్లల సెలవులను దృష్టిలో పెట్టుకొని సాహసం చేస్తున్నవాళ్లకు మాత్రం  రవాణా కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి.
 
చాంతాడంత జాబితా...

 సీమాంధ్ర సమ్మెను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే కొన్ని ప్రధాన మార్గాల్లో వందకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో స్లీపర్‌కోచ్‌లు, ఏసీ కోచ్‌లను పెంచారు. కానీ వీటిలో చాలావరకు వారానికి ఒక రోజు, రెండు రోజులు మాత్రమే నడిచే రైళ్లు కావడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు మాత్రమే ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో నడిచే రైళ్లు తక్కువ. దీంతో రెగ్యులర్ రైళ్లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తుండగా, మరికొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ బాగా పెరిగింది.

గోదావరి, విశాఖ, పద్మావతి, వెంకటాద్రి, మచిలీపట్నం, యశ్వంత్‌పూర్ తదితర ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 300 వరకు పెరిగింది. ఏ ట్రైన్‌లో  ఏ రోజు ‘నో రూమ్’ దర్శనమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ కనిపిస్తోంది. సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకొంటున్న వాళ్లకు మాత్రం ప్రత్యేక రైళ్లు పెద్దగా ప్రయోజనకరంగా కనిపించడం లేదు. కొన్ని రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నప్పటికీ దసరా సెలవులకు ముందూ, తరువాత మాత్రమే కనిపిస్తూండడంతో చాలామంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
 
కదలని బస్సులు

 సీమాంధ్ర సమ్మె దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే సుమారు 1500 బస్సులు నిలిచిపోయాయి. 60 రోజులుగా ఆర్టీసీ స్తంభించింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరం దసరా సందర్భంగా 3400 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. ఈ ఏడాది సమ్మె కారణంగా చేతులెత్తేసింది.

గత సంవత్సరం దసరా సందర్భంగా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే తరలి వెళ్లినట్లు అంచనా. ఈ ఏడాది సీమాంధ్రకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో తెలంగాణ జిల్లాలకు మాత్రమే 1500 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ బస్సులు  బయలుదేరుతాయి.

 ప్రైవేట్ బస్సుల దోపిడీ


 గత 60 రోజులుగా ప్రయాణికులపై  నిలువుదోపిడీ కొనసాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు దసరాకు మరింత పకడ్బందీగా దోపిడీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. దసరా సెలవులు ప్రారంభమైన తర్వాత ఈ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement