Sakshi News home page

మండలిలో ఇసుక దుమారం

Published Sat, Mar 25 2017 3:20 AM

మండలిలో ఇసుక దుమారం - Sakshi

అధికార, విపక్షాల మధ్య రచ్చ

మాఫియాకు టీఆర్‌ఎస్‌ అండ
విచారణ జరిపితే నిరూపిస్తా: పొంగులేటి
వంద ఎలుకలు తిన్న పిల్లి కాంగ్రెస్‌..
ఇసుకపై భారీగా ఆదాయం: కేటీఆర్‌
టియర్‌ గ్యాస్‌ దెబ్బకు పారిపోయావ్‌
కేటీఆర్‌పై షబ్బీర్‌ వ్యాఖ్యలు.. దుమారం
విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌.. వాకౌట్‌


సాక్షి, హైదరాబాద్‌: అధికార, విపక్ష సభ్యుల మధ్య  ఇసుక మాఫియా ఆరోపణలు, ప్రత్యారోపణలతో శుక్రవారం శాసనమండలి దద్దరిల్లింది. ఇసుక మాఫియాకు అధికార సభ్యుల అండదండలున్నాయన్న విపక్ష సభ్యుల ఆరోప ణలతో గందరగోళం మొదలైంది. ఇసుక సరఫరాపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానంపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాలో  ఇసుక మాఫియాపై న్యాయ విచారణ లేదా సభా సంఘం విచారణకు డిమాండ్‌ చేసింది.

ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వాకౌట్‌ చేసింది. ఉమ్మడి ఏపీలో, ప్రస్తుత తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూలేని విధంగా మిషన్‌ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్రూంలు, పంచాయతీరాజ్, మున్సి పల్‌ శాఖల పనులు జరుగుతుండడంతో ఇసు కకు బాగా డిమాండ్‌ పెరగడం నిజమేనని కేటీ ఆర్‌ అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో 2007–13 మధ్య తెలంగాణ ప్రాంతంలో ఇసుకపై ఆదా యం రూ.10 కోట్లకు మించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అవినీతిని అరికట్టి పకడ్బందీగా వ్యవహరించడంతో 2015–16లో రూ.375 కోట్లు, 2016–17లో ఇప్పటికే రూ.440 కోట్లు వచ్చింది. ఇసుక అక్రమాలను అరికట్టి వేసిన పెనాల్టీల ద్వారానే రూ.11 కోట్లు వచ్చింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ఆదాయం కంటే ఎక్కువన్నమాట!’’ అని చెప్పారు.

ఆడలేక మద్దెల ఓడు: షబ్బీర్‌
కేటీఆర్‌ సమాధానం అస్పష్టంగా ఉందని అంతకుముందు పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌) అన్నారు. ‘‘ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగుతోంది. ఇందుకు అధికార పార్టీ సభ్యుల అండదండలున్నాయి. న్యాయ విచారణకు ఆదేశిస్తే  నిరూపిస్తా. నిరూపించలేకపోతే ఖమ్మం ఖిల్లా దగ్గర ఏ శిక్షయినా అనుభవిస్తా’’ అని సవాలు విసిరారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ సభ్యులు, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచారణకు సిద్ధమని, ఏ పార్టీ వారి ప్రమేయమున్నా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ చెప్పారు. గత తప్పులను సరిచేసుకుంటూ వెళ్తున్నామన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దే అయినా ఆడలేక మద్దెల ఓడన్నట్టు ప్రతిదానికీ గత ప్రభుత్వాలు, ఉమ్మడి ఏపీ అంటూ మంత్రులు మాట్లాడుతున్నారని షబ్బీర్‌ అలీ అభ్యంతరపెట్టారు. దాంతో, రాష్ట్రంలో 45 ఏళ్లు అధికారంలో ఉండి కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిందెవరో ప్రజలకు తెలుసంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎదురుదాడికి దిగారు. వారి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో కూర్చుని గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన ఏదో అయిపోదని, ఇసుకపై తాను చెప్పింది తప్పయితే దేనికైనా సిద్ధమని కేటీఆర్‌ అన్నారు. విషయాన్ని ఆయన పక్కదారి పట్టిస్తున్నారంటూ షబ్బీర్‌ మండిపడ్డారు.

ఉద్యమ సందర్భంగా హైదరాబాద్‌ సీతాఫల్‌మండిలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ వదలగానే పారిపోయిన వ్యక్తి కేటీఆర్‌ అని విమర్శించారు. సంబంధిత పేపర్‌ క్లిప్పింగులు కూడా చూపుతానన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో గందరగోళం ఏర్పడింది. కేటీఆర్‌ ఉద్యమంలో పాల్గొన్నదీ, పారిపోయిందీ ప్రజలకు తెలుసని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ వాళ్ళను మాత్రం ప్రజలు పారదోలారన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement