అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు.. | Sakshi
Sakshi News home page

అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు..

Published Tue, May 2 2017 2:02 AM

అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు.. - Sakshi

అందుకే తప్పు ఒప్పుకున్నా...
ఆయేషా కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యంబాబు వెల్లడి  

హైదరాబాద్‌:
‘మా అమ్మను, చెల్లిని చంపేస్తామని, ఎన్‌కౌంటర్‌ చేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నాను’అని ఆయేషా కేసులో హైకోర్టు నిర్దోషి అని తేల్చడంతో బయటకు వచ్చిన సత్యంబాబు పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి, వారం రోజులు తీవ్రంగా కొట్టారని.. ఆ దెబ్బలకే తన కాళ్లు చచ్చుబడి పోయాయని, జైలులో ఉండి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి బాగయ్యాయని తెలిపారు. జైలుకు వెళ్లినప్పుడు నిరక్ష్యరాస్యుడిగా వెళ్లానని, జైలులో చదువుకుని పరీక్షలు రాసి డిగ్రీ పాసయ్యానన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యంబాబు మాట్లాడుతూ .. కేసులో మొదటి నుంచీ ఆయేషా తల్లిదండ్రులు తాను నిర్దోషినని చెపుతూ వచ్చారని, పోలీసులు అన్యాయంగా నన్ను కేసులో ఇరికిస్తే వారే తనకు అండగా నిలిచారని చెప్పారు.

వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. కొంతమంది అడ్వకేట్లు వారే ముందుకు వచ్చి కేసును వాదించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయేషా కేసులో నిందితులను పట్టుకుని శిక్ష పడేటట్లు చేసి ఆమె తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం చూడాలన్నారు. తొమ్మిదేళ్లు తాను జైలులో ఉండటంతో తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురైందన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం, వ్యవసాయం చేసుకునేందుకు స్థలం, ఇల్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ ఒత్తిడితోనే ఇరికించారు
మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిడి వల్లే దళిత సత్యంబాబును కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యంబాబు తప్పించుకోకుండా ఉండేందుకు ఆయేషా కేసుతోపాటు మరో 18 సంబంధం లేని కేసుల్లో ఇరికించారని తెలిపారు. హైకోర్టు తీర్పులో తప్పుడు కేసులో ఇరికించినందుకు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదే విషయమై త్వరలో గవర్నర్‌ను, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు.

డిగ్రీ పట్టా అందుకున్న సత్యంబాబు
సత్యంబాబు సోమవారం అంబేడ్కర్‌ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. సత్యంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో తాను ఎంఏ పూర్తి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాలపై పీహెచ్‌డీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భవిష్యత్తు ను పునర్మించుకునే పనిలో ఉన్నానని చెప్పారు.

Advertisement
Advertisement