పది ఠాణాలు.. మూడు రక్షణ సంస్థలు! | Sakshi
Sakshi News home page

పది ఠాణాలు.. మూడు రక్షణ సంస్థలు!

Published Sun, Jul 10 2016 12:34 AM

పది ఠాణాలు.. మూడు రక్షణ సంస్థలు! - Sakshi

- ఇవే ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ టార్గెట్
- వీటి వద్ద రెక్కీ సైతం పూర్తిచేసిన రిజ్వాన్
- పాతబస్తీ పోలీసుస్టేషన్లే అధికం
- నగరం చుట్టూ సేఫ్ డెన్స్ కోసం వెతుకులాట
 
 సాక్షి, హైదరాబాద్ : నగరవ్యాప్తంగా ఏకకాలంలో విధ్వంసాలకు కుట్రపన్నిన ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ అసలు టార్గెట్ పోలీస్‌స్టేషన్లు, రక్షణ సంస్థలేనట. పాతబస్తీతో పాటు పశ్చిమ మండలంలో ఉన్న ఠాణాలు, శివార్లలోని రక్షణ సంస్థల వద్ద రెక్కీ సైతం పూర్తి చేసిందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తులో బయటపడింది. ఏ తరహాదాడులు చేయాలనే అంశంపై హ్యాండ్లర్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తుండగా చిక్కింది. ఇబ్రహీం యజ్దానీ నేతృత్వం లో ఏర్పాటైన ఈ మాడ్యూల్‌లో రిజ్వాన్ కీలకంగా పనిచేశాడు. మహసిబ్ పేరుతో అకౌంట్స్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు.

సున్నిత సంస్థల్ని టార్గెట్ చేయడం ద్వారా చిన్నపాటి విధ్వంసానికే భారీ ప్రభావం చూపవచ్చంటూ సిరియా నుంచి హ్యాండ్లర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇబ్రహీం పోలీసుస్టేషన్లు, రక్షణ రంగ సంస్థల్ని ఎంచుకున్నాడు. తన ఇంట్లో అద్దెకుంటున్న రిజ్వాన్‌కు రెక్కీ బాధ్యతల్ని అప్పగించాడు. పాతబస్తీ, పశ్చిమ మండలంలోనూ రెక్కీ చేసిన రిజ్వాన్ 10 పోలీస్‌స్టేషన్లు, చాంద్రాయణగుట్టలోని 3 రక్షణ రంగ సంస్థల్ని ఎంచుకున్నాడు. అక్కడ దాడులకు అనువైన అంశాలను ఇబ్రహీంకు తెలిపాడు. ఎన్‌ఐఏ విచారణలో ఈ రెక్కీ విషయం వెలుగులోకి రావడంతో  పోలీసులు పాతబస్తీలోని అన్ని ఠాణాలకూ భద్రత కట్టుదిట్టం చేశారు.

 ఇతర రాష్ట్రాల్లోనూ మాడ్యూల్ నెట్‌వర్క్
 ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ నగరానికి మాత్రమే పరిమితమని ఇప్పటివరకు పోలీసు వర్గాలు భావించాయి. ఎన్‌ఐఏ విచారణలో వీరు బయటపెట్టిన ఓ అంశం దేశంలోని ఇతర ప్రాంతాలతోనూ లింకులు ఉన్నాయనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ ఏడాది మేలో ఈ మాడ్యూల్ హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి వచ్చినట్లు బయటపడింది. అనంతపురం వెళ్లి నంది లాడ్జిలో బస చేసిరావడానికి ముందు తమ సెల్‌ఫోన్లు ఇళ్లల్లోనే వదిలి పారిపోయారు. సమాచార మార్పిడి కోసం కొత్త సెల్‌ఫోన్లు, బోగస్ ధ్రువీకరణలతో సిమ్‌కార్డులు తీసుకున్నారు. దీనికి కారణం ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాడ్యూల్‌కు చెందిన వ్యక్తి పోలీసులకు చిక్కాడని సమాచారం అందడమే. దీంతో 2 రోజుల పాటు మహారాష్ట్రలోని చించోలీలో తలదాచుకున్నారు. ఆపై తమ ‘కాంటాక్ట్’ భద్రంగా ఉన్నాడని, పోలీసులు పట్టుకున్నది వేరే వారినని తెలిసి తిరిగి వచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాడ్యూల్ అనుచరుల కోసం ఎన్‌ఐఏ గాలింపు చేపట్టింది.

 శివార్లలో సేఫ్ డెన్ కోసం యత్నం..
 నగరంలో విధ్వంసం జరిగిన తర్వాత పోలీసు, నిఘా వర్గాలు తనిఖీలు, కట్టడి చర్యలు ప్రారంభిస్తే మార్గమధ్యంలోనే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని భావించిన ఈ మాడ్యూల్.. సిటీ నుంచి దూరంగా కాకుండా చుట్టుపక్కలే ఓ సేఫ్‌డెన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. నగరంలో దాడులు చేసిన తర్వాత ఒకటి 2 రోజులు అక్కడ బస చేసి, ఆపై దూర ప్రాంతానికి పారిపోవాలని కుట్రపన్నింది. దీనికై నగరం చుట్టూ విస్తరించి ఉన్న పోచంపల్లి, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, మేడ్చల్, షాద్‌నగర్ తదితర చోట్ల గాలించి వచ్చింది.

 ఇబ్రహీం భార్యకూ విషయం తెలుసా?
 తాను ఐసిస్‌లో చేరేందుకు వివిధ మార్గాల్లో సిరియా వెళ్లాలని ప్రయత్నించిన ఇబ్రహీం తనతో పాటు భార్య, సోదరుడు ఇలియాస్‌నూ  తీసుకువెళ్లాలని భావించానని విచారణలో బయటపెట్టాడు. గతేడాది సెప్టెంబర్ వరకూ కుటుం బంతో సిరియా వెళ్లిపోవడానికే ప్రయత్నాలు చేశాడు. స్టూడెంట్ వీసా సంపాదించడం ద్వారా భార్య, పిల్లలతో పాటు సోదరుడు ఇలియాస్‌ను తీసుకువెళ్లాలని భావించాడు. అంతా కలసి ఐసిస్‌లో చేరి పోరాటం చేయాలని పథకం వేశాడని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇబ్రహీం కార్యకలాపాలు అతడి భార్యకూ తెలిసి ఉండచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పీజీ విద్యార్థి ముసుగులో టర్కీ, గ్రీస్‌లకు వెళ్లి అక్కడ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటడం ద్వారా సిరియా చేరుకోవాలని భావించాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ వర్సిటీల్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ సీటు పొందాలని పథకం వేశాడు. 2 దేశాల్లోనూ ప్రభుత్వ వర్సిటీల్లో సీటు లభించకపోవడం, ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉండటంతో ఆ ప్రయత్నాలు మానుకున్నాడని ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది.

Advertisement
Advertisement