ఆప్షన్లను బట్టే సీట్లు! | Sakshi
Sakshi News home page

ఆప్షన్లను బట్టే సీట్లు!

Published Wed, Jun 28 2017 3:36 AM

ఆప్షన్లను బట్టే సీట్లు!

- నేడు ఎంసెట్‌ సీట్ల కేటాయింపు
గతేడాదితో పోల్చితే తగ్గిన సీట్ల సంఖ్య
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ సీట్ల కేటాయింపును బుధవారం రాత్రి 8 గంటలకు ప్రకటించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది కంటే ఈసారి సీట్లు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకే సీట్లు లభించే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈసారి సీట్ల సంఖ్య తక్కువగా ఉంది. కన్వీనర్‌ కోటాలో 64,300 సీట్లే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 63,216 మంది విద్యార్థులు 31,30,419 వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. గతేడాది కంటే ఈసారి 3 లక్షలకు పైగా ఆప్షన్లు తగ్గడంతో ఎంతమందికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభిస్తాయన్నది ఆసక్తిగా మారింది. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు వచ్చే నెల 3 వరకు గడువివ్వనున్నారు.
 
నేడు ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల కేటాయింపు
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు సీట్ల కేటాయింపును బుధవారం ఉదయం 10 గంటలకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ప్రకటించనుంది. సీట్లు పొందిన వారు ఈనెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు రిపోర్టింగ్‌ కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఐఐటీల్లో సీట్ల కేటాయింపునకు పరిగణనలోకి తీసుకున్న టాప్‌–20 పర్సంటైల్‌ కటాఫ్‌ మార్కులను కూడా రాష్ట్రాల వారీ బోర్డుల ప్రకారం వెల్లడించింది. తెలంగాణలో జనరల్‌ అభ్యర్థులకు 467, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ 464, ఎస్సీ 454, ఎస్టీ 456, వికలాంగులకు 454 మార్కులు కటాఫ్‌గా ప్రకటించింది. ఈ కటాఫ్‌లో ఉన్నా లేకున్నా జనరల్, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ విద్యార్థులు ఇంటర్‌లో 75 శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 65 శాతం మార్కులు సాధిస్తే పరిగణనలోకి తీసుకొని సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement