నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి

Published Thu, Aug 10 2017 4:50 AM

నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి - Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నేరెళ్ల బాధితుల వద్దకు వరంగల్‌ ఎంజీఎంకు చెందిన ఇద్దరు సీనియర్‌ వైద్యులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రా పురం గ్రామాలకు చెందిన ఆరుగురు బాధితు లను పరీక్షించి, వారి ఒంటిపై ఉన్న గాయాలు, వాటి తీవ్రత తెలుసుకోవాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను రాతపూర్వకంగా నివేదిక రూపంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

బాధితులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్య దర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు, డాక్టర్ల నివేదిక తమ ముందుం చాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగ నాథన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ ప్రారంభించింది.

లారీల వల్ల స్థానికులు చనిపోతున్నారు
తంగళ్లపల్లి వాగు నుంచి ఇసుక తీసుకుని నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం మీదుగా రాత్రీపగలు ప్రతీరోజూ 150–200 లారీలు వెళుతున్నాయని విచారణ సందర్భంగా రఘునాథ్‌ చెప్పారు. దీనివల్ల ఆ గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరణాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఈ మూడు గ్రామాల ప్రజలు అధికారులను కోరినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పోలీసుల దెబ్బలకు బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయని, వారికి తక్షణమే మెరుగైన వైద్యసాయం అందకుంటే శాశ్వతంగా ఆ అవయవాలు పనిచేయకుండా పోతాయని  ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఎంజీఎంలో చికిత్సనందిస్తాం: ఏజీ
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ.. గతనెల 13న పీయూసీఎల్‌ నిజ నిర్ధారణ కమిటీ సంబంధిత గ్రామాలకు వెళ్లిందని, పిటి షన్‌ మాత్రం ఇప్పుడు దాఖలు చేశారన్నారు. పిటిషనర్‌ ఆరోపణల నేపథ్యంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి చికిత్సను అందజే స్తామన్నారు. అయితే అంతకన్నా ముందు  ఇద్దరు ఎంజీఎం వైద్యులను బాధితులు చికిత్స పొందుతున్న మనోరమ ఆసుపత్రికి పంపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదే శించింది. ఈ సమయంలో రఘునాథ్‌ జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్‌ వైద్యులను పంపాలని కోరారు. ముందు బాధి తులకు చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇద్దామని, అవసరమైతే ఫోరెన్సిక్‌ డాక్టర్లను పంపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement