రేపే ఎస్‌ఐ రాత పరీక్ష | Sakshi
Sakshi News home page

రేపే ఎస్‌ఐ రాత పరీక్ష

Published Sat, Apr 16 2016 3:58 AM

రేపే ఎస్‌ఐ రాత పరీక్ష - Sakshi

హాజరుకానున్న రెండు లక్షల మంది
పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి: రిక్రూట్‌మెంట్ బోర్డు
గెజిటెడ్ సంతకం తప్పనిసరి అంటున్న అధికారులు
వరుస సెలవులతో సంతకం దొరక్క ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు

 
సాక్షి, హైదరాబాద్: పోలీసు కొలువులకు తొలి అడుగు పడనుంది. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ విభాగాల్లోని 539 ఎస్‌ఐ పోస్టులకు దాదాపు రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోలీసు శాఖ తొలిసారిగా నిర్వహించనున్న ఈ పరీక్ష పారదర్శకంగా జరిగేలా రిక్రూట్‌మెంట్ బోర్డు పటిష్ట చర్యలు తీసుకుంది. ఎలాంటి అవకతవకల్లేకుండా చూసేందుకు అభ్యర్థుల వేలిముద్రలు స్వీకరిస్తోంది. ఇందుకోసం అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు సూచించింది. అలాగే పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..
ఎస్‌ఐ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటో అటెండెన్స్ తీసుకునేందుకు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. దీని ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని బోర్డు భావిస్తోంది. వేలిముద్రలు తీసుకోవడం ద్వారా తదుపరి జరిగే దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్షల్లో వేలిముద్రలను సరిపోల్చనున్నారు. దీంతో అక్రమార్కులకు చెక్ పెట్టొచ్చని ఆలోచిస్తోంది. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకోవడానికి ఒక యాప్‌ను సైతం రూపొందించి సేవలందిస్తోంది. ఎండల తీవ్రత భారీగా ఉండటంతో అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎండ వేడిమి కాారణంగా అభ్యర్థులకు ఏదైనా ఆపద తలెత్తితే వెంటనే చికిత్సలు అందేలా అంబులెన్స్ వాహనాలను అందుబాటులో ఉంచుతోంది.
 
 
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు వచ్చేటప్పుడు అభ్యర్థులు కచ్చితంగా ఆన్‌లైన్ దరఖాస్తు కాగితాలపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అని సూచిస్తోంది. అయితే ప్రస్తుతం వరుసగా ప్రభుత్వ సెలవులు ఉండటంతో అభ్యర్థులకు గెజిటెడ్ సంతకాలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోటిఫికేషన్ సందర్భంగానే ఆన్‌లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అని పేర్కొంది. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించలేదు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నియమ నిబంధనల్లో ఈ అంశాన్ని చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష సందర్భంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటపుడు గెజిటెడ్ సంతకం కోరవచ్చు కదా అని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు మాత్రం ప్రిలిమినరీ పరీక్షకు వచ్చేటప్పుడు గెజిటెడ్ సంతకం తప్పనిసరి చేసుకుని రావాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement