సైలెంట్ షాక్ ! | Sakshi
Sakshi News home page

సైలెంట్ షాక్ !

Published Sat, Apr 2 2016 1:06 AM

సైలెంట్ షాక్ ! - Sakshi

పేదలపైనే ప్రతాపం   
విద్యుత్ చార్జీల్లో కొత్త కేటగిరీలతో దొంగదెబ్బ

 
♦ రోజువారీ ఉపకరణాలైన టీవీ, ఫ్యాన్ వాడినా బిల్లు మోతే
♦ దశాబ్దాల నాటి 75 యూనిట్ల పరిమితి ప్రకారం కొత్త శ్లాబులు
♦ ప్రస్తుతం నెలకు సాధారణ వినియోగం 100 యూనిట్లపైనే
♦ కొత్త విధానంతో పేద, మధ్యతరగతి వర్గాలపై భారం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి వర్గాలపై మరో చార్జీల బండ వేసింది. విద్యుత్ శ్లాబుల వర్గీకరణతో వారిని దొంగదెబ్బతీసింది. తాజాగా ప్రకటించిన విద్యుత్ చార్జీల పెంపులో ఆ విషయం స్పష్టమవుతోంది. గతేడాది వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుని కొత్త కేటగిరీలు రూపొందించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిత్యావసరాలైన విద్యుత్ ఉపకరణాలు వాడినా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బిల్లుల షాక్ తగలనుంది. 2015-16 వినియోగం ప్రకారం 900 యూనిట్లు లోపు వాడినవారిని ‘ఎ’ కేటగిరీలో, 901 నుంచి 2,700 లోపు వాడినవారిని ‘బి’ కేటగిరీలో, ఆపైన వాడినవారిని ‘సి’ కేటగిరీలో చేర్చారు. కొత్త విధానంపై ప్రజలకు ఏమాత్రం అవగాహన కల్పించకుండా వారిని కేటగిరీల వారీ విభజించడం చాలా అసంబద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల నుంచి భారీగా డబ్బులు రాబట్టే కుయుక్తి అని వారు వివరిస్తున్నారు. కొత్త విధానంలో ఆ వర్గాల వారి బిల్లులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

 దశాబ్దాల నాటి లెక్క..
 వాస్తవానికి సగటు విద్యుత్ వినియోగాన్ని (నెలకు 75 యూనిట్లు) కొన్ని దశాబ్దాల క్రితం నిర్ణయించారు. అప్పట్లో కేవలం విద్యుత్ దీపాలు తప్ప, ఎలాంటి ఆధునిక ఉపకరణాలు లేవు. గత దశాబ్దకాలంగా ఆధునిక జీవన విధానంలో అనూహ్య మార్పులొచ్చాయి. టీవీ, ట్యూబ్‌లైట్, ఫ్యాన్లు, మొబైల్ చార్జర్లు, వేసవిలో కూలర్లు, ఇస్త్రీ పెట్టె, హీటరు, ఫ్రిజ్ వంటివి కనీస అవసరాలయ్యాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆ ఉపకరణాల్లో కొన్నిటినైనా వాడకుండా రోజుగడిచే పరిస్థితి లేదు. వాటిల్లో రోజుకు పదిగంట చొప్పును టీవీ, రెండు లైట్లు, సీలింగ్‌ఫ్యాన్ వాడినా నెలకు 75 యూనిట్లపైనే అవుతుంది.

పేద ప్రజల ఇళ్లల్లో కూడా ఈరోజుల్లో టీవీ, ఫ్యాన్లు ఉంటున్న విషయం తెలిసిందే. ఏ ఉపకరణాలు లేని సమయంలో లెక్కను తీసుకుని, కనీస వినియోగాన్ని 75 యూనిట్లుగా చూపడం సరికాదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. వినియోగ పరిమితి పెంచకున్నా ఫర్వాలేదు.. కానీ 75 యూనిట్లు దాటితే శ్లాబులే మార్చే విధానం ఎంతమాత్రం సహేతుకం కాదంటున్నారు. నేటి పరిస్థితుల్లో అది ప్రజలపై భారమేనని చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది అట్టడుగు పేద వర్గాల వారికి కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా 75 యూనిట్ల పరిధి దాటితే భారీ ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీజీజేవై) పథకానికి విఘాతం కలిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ దొంగచాటు బాదుడుతే వారు విద్యుత్ లేకపోయినా నయమనుకునే పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు.
 
 కొత్త బాదుడు ఇలా..

 గత శ్లాబుల ప్రకారం విద్యుత్ వాడకంలో మొదటి 50 యూనిట్ల వరకూ రూ. 1.45 చొప్పున వసూలు చేసేవారు. 51 నుంచి 100 యూనిట్ల వరకూ రూ. 2.60 పైసల చొప్పున.. 101 నుంచి 200 యూనిట్ల వరకూ రూ. 3.60 పైసల చొప్పున చార్జీ పడేది. అయితే కొత్త విధానం ఇందుకు పూర్తి భిన్నంగా రూపొందించారు. గతేడాది వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల తొమ్మిది వందల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించిన వారై నా.. ఇప్పుడు కేటగిరీ ‘బి’లో ఉంటారు. వారు ఈ ఏడాదిలో నెలకు ఎంత తక్కువగా కాల్చుకున్నా కూడా యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఈ ఏడాది ‘బి’ కేటగిరీలో ఉన్న ఒక వినియోగదారుడు నెలలో 75 యూనిట్లు వాడాడు అనుకుంటే.. అతను యూనిట్‌కు రూ. 2.60 చొప్పున రూ. 195 చెల్లించాల్సి ఉంటుంది. అదే గత శ్లాబుల్లో అయితే మొదటి 50 యూనిట్లకు రూ. 1.45 చొప్పున.. మిగిలిన 25 యూనిట్లకు రూ. 2.60 చొప్పున మొత్తం రూ. 137.50 చెల్లించేవాడు. ఇపుడు ఈ కొత్త విధానంలో అతను వినియోగించిన 75 యూనిట్లపై రూ. 57.50 పైసలు భారం పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ విద్యుత్ వినియోగించేవాళ్లకయితే అది మరింత భారం కానుంది.
 
 75 యూనిట్ల లోపు ఎలా సాధ్యం?
  ఏ చిన్న ఇంటిని తీసుకున్నా 4 లైట్లు తప్పనిసరి. వీటిని రోజుకు ఐదు గంటలు వాడినా కనీసం నెలకు 18 యూనిట్లు ఖర్చవుతుంది. రెండు ఫ్యాన్లు కనీసం రోజుకు 10 గంటలు వాడితే, నెలకు 15 యూనిట్లు వస్తుంది. ఫ్రిజ్ రోజుకు సగటున 10 గంటల వాడకం ఉన్నా 30 యూనిట్లు అవుతుంది. ఇస్త్రీ పెట్టె సగటున రోజుకు గంట వాడినా నెలకు 22 యూనిట్లు అవుతుంది. టీవీని రోజుకు 10 గంటలు వాడినా నెలకు 46 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. ఇలా  నెలకు 131 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అయినా 75 యూనిట్లు దాటితే విద్యుత్ బిల్లు రెట్టింపు అవ్వడం వినియోగదారులకు పెనుభారం కానుంది.

Advertisement
Advertisement