‘భారత్‌ను బచాయించారు’ | Sakshi
Sakshi News home page

‘భారత్‌ను బచాయించారు’

Published Tue, Aug 23 2016 12:46 AM

‘భారత్‌ను బచాయించారు’

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో ప్రధాన కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున పాఠశాలల విద్యార్థులు తరలి రావడంతో స్టేడియం పూర్తిగా నిండిపోవడం విశేషం. ముందుగా ఓపెన్ టాప్ జీపులో సింధు, గోపీచంద్ స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం జరిగింది. మంత్రి కేటీఆర్.. సింధు, గోపీలకు జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ప్రపంచ వేదికపై ఇద్దరు భారత బేటీలు దేశాన్ని బచాయించారు. ఇప్పుడు సింధు ఆమె తల్లిదండ్రులకే కాదు దేశానికే బిడ్డలాంటిది. గోపీ, ఇతర సీనియర్ ఆటగాళ్ల సహకారంతో మంచి క్రీడా విధానాన్ని రూపొందిస్తాం. 2020కే కాకుండా 2024లో మనవాళ్లు మరిన్ని పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సౌకర్యాలూ కల్పిస్తుంది. రజతం గెలిచిన సింధుకు నా అభినందనలు’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం గెలవాలని  కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఒగ్గు కళాకారుల డోలు విన్యాసం, పేరిణీ నృత్యం ఆకట్టుకున్నాయి. 

 
ఊహించలేదు: సింధు

నగరంలో తనకు అపూర్వ స్వాగతం, ర్యాలీకి ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం, స్టేడియంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం తాను ఊహించలేదని, ఇప్పటికీ కలగా అనిపిస్తోందని సింధు వ్యాఖ్యానించింది. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆటగాళ్లను ఈ తరహాలో గౌరవించడం అందరిలో స్ఫూర్తి నింపుతుందని గోపీచంద్ అన్నారు. ‘2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి విజయాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను. అప్పుడు ఇంకా బాగా ఆడాలనే తపన నాలో పెరిగింది. సింధులాంటి విజయాలు ఒక తరం మొత్తాన్ని ఆటల వైపు ప్రోత్సహించేలా చేస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఇతర రంగాలతో పాటు క్రీడల్లో కూడా చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నా’ అని ఆయన చెప్పారు.

 

 

Advertisement
 
Advertisement