Sakshi News home page

కీలక విషయాలు వెల్లడించిన సుబ్బరాజు!

Published Fri, Jul 21 2017 6:43 PM

కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ - Sakshi

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ మాఫియా కేసులో మూడోరోజు సిట్‌ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం (శుక్రవారం) అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్‌ అధికారులు సుమారు ఎనిమిది గంటలకు పైగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్‌ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.

ఓ దశలో సుబ్బరాజు విచారణ ముగిసిందని వార్తలు వెలువడ్డా... మరికొన్ని గంటల పాటు సుబ్బరాజు ప్రశ్నిస్తామని ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. కొద్దిసేపు బ్రేక్‌ ఇచ్చామని, అనంతరం విచారణ కొనసాగుతుందన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 70 పబ్‌లకు నోటీసులు ఇచ్చామని, రేపు పబ్‌లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అదుపులో ఉన్న పలువురు పబ్‌లో డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చారని, 16 పబ్‌ల్లో డ్రగ్స్‌ అమ్ముతున్నారని వాళ్లు వెల్లడించారన్నారు. రేపు నటుడు తరుణ్‌ను విచారణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27న ముమైత్‌ ఖాన్‌ విచారణకు పిలిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు.

అంతకు ముందు ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ మాట్లాడుతూ సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని, ఇవాళ కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లు ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆ వివరాల గురించి విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అలాగే నోటీసులు అందుకున్న ముమైత్‌ఖాన్‌, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని ఆయన తెలిపారు.

మరోవైపు సుబ్బరాజు రక్తనమునా సేకరణ కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్‌ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చినవారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యాం కె నాయుడును విచారణ చేశారు. శనివారం నటుడు తరుణ్‌ సిట్‌ ఎదుట హాజరు అవుతారు.

Advertisement
Advertisement