నయీం కేసు దర్యాప్తు సిట్కు అప్పగింత | Sakshi
Sakshi News home page

నయీం కేసు దర్యాప్తు సిట్కు అప్పగింత

Published Wed, Aug 10 2016 3:16 PM

నయీం కేసు దర్యాప్తు సిట్కు అప్పగింత - Sakshi

 హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా ఐజీ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్సీలు సహా 8మందితో ఏర్పాటు అయిన సిట్ బృందానికి నాగిరెడ్డి నేతృత్వం వహిస్తారు.  కాగా శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అంతర్గతంగా వివిధ కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావించింది.

మరోవైపు నయీమ్, అతని అనుచరుల నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు, వజ్రాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. లెక్కకు మించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వందలాది ఎకరాల భూములకు  సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పోలీసులు బుధవారం ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వనస్థలిపురం ద్వారకామయినగర్లో నయిం అనుచరుడు ఖయ్యుమ్ నివాసాన్ని పోలీసులు గుర్తించారు. ఖయ్యుమ్ ఇంట్లో కీలక పత్రాలు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నయీం అనుచరులు పరారయ్యారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడిని నల్లగొండ తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.

కాగా నయీం అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు నయీం కూడబెట్టిన ఆస్తి రమారమి రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా. సిట్ విచారణ అనంతరం ఆస్తులకు సంబంధించి స్పష్టత రానుంది. నయీం వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో జాబితా రూపొందించి వాటి వివరాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ద్వారా కోర్టు అనుమతితో ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. 

Advertisement
Advertisement