అది వ్యభిచారమే.. హల్‌చల్‌ చేస్తున్న వీడియో! | Sakshi
Sakshi News home page

అది వ్యభిచారమే.. హల్‌చల్‌ చేస్తున్న వీడియో!

Published Sat, Apr 23 2016 7:24 PM

అది వ్యభిచారమే.. హల్‌చల్‌ చేస్తున్న వీడియో! - Sakshi

-హీరో: 'ఏమిటీ నీ హక్కు.. ప్రజల్ని మోసం చేయడమా? పార్టీ మారడమా?'

విలన్: 'ఒక పౌరునిగా నాకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు నాకుంది..'

హీరో: ఒక పౌరుడిగా ఉండవచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా లేదు. నిన్ను చూసి, నీ సామర్థ్యం చూసి, నువ్ చేసిన వాగ్దానాలను నమ్మి, నిన్ను గెలిపించారనుకుంటున్నావా ఈ ప్రజలు.. మీ పార్టీ నాయకులను చూసి.. ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవించి నిన్ను గెలిపించారు. ఆ పార్టీ ప్రతినిధిగా ఉంటావని కార్యకర్తలందరూ నిద్రాహారాలు మాని.. ప్రాణాలకు తెగించి నీకా పదవిని కట్టబెడితే.. ఇప్పుడు పార్టీ మారే హక్కు నీకెవరు ఇచ్చారు. పార్టీ మార్చడమంటే అగ్ని సాక్షిగా పెళ్లాడిన ఇల్లాలిని వదిలేసి.. వ్యభిచారం చేయడంతో సమానం''..
కృష్ణ హీరోగా నటించిన 'ఈనాడు' సినిమాలోని పవర్‌ఫుల్ దృశ్యమిది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. పార్టీ మారిన విలన్ రావుగోపాల్‌ రావుని ప్రజలందరి ముందు నిగ్గదీసి అడుగుతూ సూపర్ స్టార్‌ కృష్ణ చేసిన డైలాగులు ఆన్‌లైన్‌లో దుమారం రేపుతున్నాయి.

ఒక పార్టీ జెండాతో ప్రజల్లోకి వెళ్లి.. ఆ పార్టీ అజెండాను ప్రచారం చేసి.. ఆ పార్టీ గుర్తు మీద ఓట్లు పొంది.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు ఇప్పుడు పదవులకో, ప్రలోభాలకో తలొగ్గి నిలువునా అమ్మడుపోతున్న తీరును ఎండగడుతూ నెటిజన్లు ఈ వీడియోను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఓటేసిన నేతలే తమల్ని నిలువునా మోసం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి.. పట్టపగలే మారి పార్టీ మారి పచ్చ కండువా కప్పుకొంటున్న ఎమ్మెల్యేల తీరును తప్పుబడుతున్నారు.

హీరో కృష్ణ నటించిన 'ఈనాడు' సినిమాలోని ఓ దృశ్యాన్ని షేర్‌ చేస్తున్న నెటిజన్లు.. వైఎస్‌ఆర్‌ సీపీ జెండా నీడన ఫ్యాన్‌ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు ఇప్పుడు నిస్సిగ్గుగా పార్టీ మారి.. పచ్చ కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్నారు. అధికార పార్టీ టీడీపీ ప్రలోభాలకు గురిచేసి వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై సోషల్‌ మీడియాలో జనాగ్రహం వ్యక్తమవుతున్నది. 'సేవ్‌ డెమొక్రసి' పేరిట వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ఉద్యమంలో నెటిజన్లు కూడా తమ వంతుగా గళమెత్తుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement