మోదీకి మట్టి పార్సిల్.. | Sakshi
Sakshi News home page

మోదీకి మట్టి పార్సిల్..

Published Sat, Oct 24 2015 9:47 PM

మోదీకి మట్టి పార్సిల్.. - Sakshi

- 'మట్టి సత్యాగ్రహం' పేరుతో ఏపీసీసీ వినూత్న నిరసన
- ప్రధానికి మట్టిని పార్సిల్ పీసీసీ చీఫ్ చేసిన రఘువీరారెడ్డి

సాక్షి, హైదరాబాద్ :
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీసీసీ ఆధ్వర్యంలో సరికొత్త నిరసన తెలిపారు. 'మట్టి సత్యాగ్రహం' పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఇందిరాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మహిళా సర్పంచ్‌లు తమ గ్రామాల నుంచి పంపిన మట్టిని ప్రధాని నరేంద్ర మోదీకి కొరియర్‌లో పంపారు.

ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, ముఖ్య నేతలు ఎన్.తులసిరెడ్డి, గంగాభవానీ, జంగా గౌతం, టి.జె.సుధాకర్‌బాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రఘువీరా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలనేది రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు అనీ దీనిని ప్రధానికి వినిపించాలనేది తమ అభిమతం అనీ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారని అదే రీతిలో తామిపుడు మట్టి సత్యాగ్రహం చేపట్టామన్నారు. అనంతపురం జిల్లాలలోని గంగులమాయిపాళెం సర్పంచ్ వనమక్క, గోవిందాపురం సర్పంచ్ లక్ష్మీదేవమ్మ ఇద్దరూ తమ గ్రామాల్లో మట్టిని తనకు అంద జేస్తూ ప్రత్యేక హోదా కోరుతూ తాము రాసిన లేఖలను ప్రధానికి పంపాల్సిందిగా తనను కోరారని వారిచ్చిన స్ఫూర్తితో తామీ కార్యక్రమం చేపట్టామన్నారు.

ఇదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు సొంత గ్రామాలతో పాటుగా రాష్ట్రంలోని 22 వేల గ్రామాలు, 3వేల మున్సిపల్ వార్డుల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలనే అంశంపై చర్చించడానికి నవంబర్ 3వ తేదీన విజయవాడలో డీసీసీ అధ్యక్షుల, ముఖ్యనేతల విసృ్తత సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఒక కార్యాచరణను రూపొందించి గ్రామాల నుంచే కాదు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల నుంచి కూడా మట్టిని సేకరిస్తామన్నారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదుల నుంచి నీటిని కూడా పంపిస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement