‘విభజన’ సమస్యలు పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

‘విభజన’ సమస్యలు పరిష్కరించండి

Published Fri, May 16 2014 12:44 AM

‘విభజన’ సమస్యలు పరిష్కరించండి

సీఎస్ మహంతికి టీఎన్‌జీవోల నివేదన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న వివిధ సమస్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సచివాలయంలో టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి నేతృత్వంలో యూనియన్ నూతన కార్యవర్గం సభ్యులు సీఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ దృష్టికి వారు పలు అంశాలను తీసుకెళ్లారు. సీఎస్ స్పందిస్తూ శాఖల విలీన ప్రతిపాదనలు లేవని చెప్పినట్లు యూనియన్ నేతలు వెల్లడించారు.

వారు ప్రస్తావించిన అంశాలు...

* ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర స్థాయి అధికారులను స్థానికత ఆధారంగా వెంటనే బదిలీ చేయాలి. జోనల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల విషయంలోనూ చర్యలు చేపట్టాలి.
 
* జీహెచ్‌ఎంసీలోని స్థానికేతర అధికారులను బదిలీ చేయాలి.
 
* రాంకీ సంస్థతో జీహెచ్‌ఎంసీ చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలి.
 
* కోఠిలోని వైద్యశాఖ కార్యాలయాన్ని సీమాంధ్రకు కేటాయించే ప్రతిపాదనను రద్దు చేయాలి.
 
* 17న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ఉద్యమిస్తాం.
 
* సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ సొసైటీలో కలిపే ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి.
 
నూతన కార్యవర్గానికి అభినందన...
టీఎన్‌జీవో కార్యవర్గానికి రెండోసారి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిలను రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అభినందించారు. సహకార శాఖ, డ్రగ్ కంట్రోల్, వ్యవసాయ విశ్వ విద్యాలయం, వైద్య శాఖ, ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ బోర్డు తదితర శాఖల ఉద్యోగులు సన్మానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement