ఔను.. ఆయన ప్రేమలో పడ్డారు! | Sakshi
Sakshi News home page

ఔను.. ఆయన ప్రేమలో పడ్డారు!

Published Sat, Dec 13 2014 11:37 PM

ఔను..    ఆయన ప్రేమలో పడ్డారు!

సోమేశ్ కుమార్... జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా 14 నెలలుగా నగర ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్‌గా జీహెచ్‌ఎంసీ పాలక మండలి, స్టాండింగ్ కమిటీల బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. లక్ష్య సాధనలో భాగంగా తాను శ్రమిస్తూ... ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించే  ఆయన సీరియస్ ఆఫీసర్‌గానే అందరికీ తెలుసు.

ఇదంతా నాణేనికి ఒకవైపు

అందరిలాగే ఆయనకూ హాబీలు... అలవాట్లు ఉన్నాయి. మరచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. మనసును మెలిపెట్టిన బాధాకర ఘటనలు ఉన్నాయి. పత్రికలు చదవడమే కాదు...పుస్తకాలు రాసే అభిరుచి ఉంది. ఆరోగ్యం కోసం నడకతో పాటు సమాజ క్షేమానికి ఉపకరించే మొక్కలపైనా మక్కువ ఉంది. సినిమాలు.. షికార్లు.. ఇతరత్రా సరదాలు ఉన్నాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ప్రేమ కథ ఉంది. పెళ్లి దాకా వేచి చూసిన నిరీక్షణ ఉంది.

ఇది నాణేనికి రెండోవైపు

వ్యక్తిగత విషయాలతో పాటు ప్రజా జీవితానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు. తమ కుటుంబానికి చెందిన వివిధ అంశాలను తన సతీమణి డాక్టర్ జ్ఞాన్ ముద్రతో కలిసి ‘మార్నింగ్‌వాక్’లో సోమేశ్‌కుమార్ ‘సాక్షి’తో
 పంచుకున్నారు. ఆ విశేషాలు..
 
ఈ ఆదివారం ప్రత్యేకం..

 
జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్  సోమేశ్‌కుమార్‌తో ‘మార్నింగ్ వాక్’
 
సిటీబ్యూరో:  ప్రస్తుత డిజిటల్ రోజుల్లో ఏ దరఖాస్తు నింపాలన్నా ఫస్ట్ నేమ్, మిడిల్‌నేమ్, లాస్ట్‌నేమ్‌లు అవసరం. ఈ స్పెషలాఫీసర్‌కు మాత్రం  ఫస్ట్ నేమ్ సోమేశ్... లాస్ట్ నేమ్ కుమార్. ఇంటి పేరు కనిపించదు. ప్రాథమిక విద్యలో ఉన్నంత కాలం పాఠశాల రిజిస్టర్లలో పేరుకు ముందు ఇంటి పేరు ఉన్నప్పటికీ. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ వచ్చేనాటికి పేరు మాత్రమే మిగిలింది. ఇంటి పేరు ఉంటే కులం, మతం వంటి వివరాలు తెలిసే వీలుంటుంది. అవేవీ అక్కరలేని సమానత్వమే కావాలనుకుంటున్న మిగతా విద్యార్థుల మాదిరిగానే ఇంటిపేరు లేకుండా పరీక్షల దరఖాస్తును నింపారు. సర్టిఫికెట్ అలాగే వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
 
ఐఏఎస్ కల...

తండ్రి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేసే వారు. ఐఏఎస్‌లు సాధించిన వారు ఊళ్లోనే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ప్రభావం చూపుతుండటంతో పెద్ద అధికారులైతే అలాంటి అవకాశం వస్తుందని సోమేశ్ కుమార్ భావించారు. చాలా మంది జీవితాలు మార్చేందుకు ఐఏఎస్ కావడమే మార్గమనుకున్నారు. దాన్ని పొందేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడయ్యారు.
 
 మొక్కలతో దోస్తీ

చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకంపై సోమేశ్ కుమార్‌కు మక్కువ. కరువు జిల్లా అనంతపురం కలెక్టర్‌గా పని చేసినప్పుడు 60 ఎకరాల్లో చింతచెట్లు నాటించారు. పాడేరులో 40 వేల ఎకరాల్లో నాలుగు కోట్ల సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం ఓ రికార్డు. వాటి నీడలో పెరిగే కాఫీ మొక్కలతో అక్కడి ప్రజలకు ఓ జీవనమార్గం చూపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా గ్రీన్‌కర్టెన్‌లకు తెర తీశారు. రోడ్ల పక్కన ఫుట్‌ఫాత్‌లను ఆనుకుని ఉండే గోడలు కనిపించకుండా తీగల్లా పెరిగే మొక్కలు నాటడం.. ఫుట్‌పాత్‌లపై తక్కువ ఎత్తులోని మొక్కలతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు.

రాయడమంటే ఇష్టం...

బాల్యం నుంచీ రాసే అల వాటు ఉంది. ఏడోతరగతిలో  మోడల్ ప్రశ్నపత్రాలను రూపొందించి.. వా టికి సమాధానాలు కూడా చిన్న పేరాల్లా రాసి మిత్రులకు పంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలంటీ భయపడే వారికి అవి ఉపయోగపడేవి. పెద్ద సమస్యలను సరళం చేయడం అలా అలవడింది. అదే ధోరణిలో  జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను లెక్కింపును మూడు ముక్కలతో తేల్చిపారేశారు.
 నాయకత్వ లక్షణాలు..
 ఢిల్లీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్నారు. పీజీ సాయంత్రం తరగతుల విభాగానికి ఉపాధ్యక్షునిగా పని చేశారు.
 
సినిమాలూ...నటులు

 
సినిమాలంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు సినిమాలు చూస్తానంటారు.అంతకుముందు ఇంకా ఎక్కువే చూసేవారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం సంతోషాన్నిచ్చే చర్య. నచ్చిన సినిమాల్లో  రెండు మూడు చెప్పమంటే చక్‌దే ఇండియా, బ్యాండ్‌బాజా భారత్, 3 ఇడియట్స్ .. అంటారు. నటుల్లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల  నుంచి రవితేజ దాకా, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాల నుంచి సోనాక్షిసిన్హా, విద్యాబాలన్‌ల దాకా వివిధ పేర్లు ప్రస్తావించారు.
 మరచిపోలేనిది: కుటుంబంతో కలసి సత్యసాయి వద్ద గడిపిన క్షణాలు.
 
బాధ పడ్డ క్షణాలు..

    
ఐఏఎస్ కోసం రెండుసార్లు కష్టపడినా ఎంపిక కాలేదు. రెండోసారి అవకాశం ఒక్క అడుగు దూరంలోనే చేజారిపోయినప్పుడు.అనంతపురం జిల్లాలో పని చేసేటప్పుడు పల్స్‌పోలియో తరహాలో చిన్న పిల్లల్లో నట్టల నివారణకు 8 లక్షల డోసుల మందు  వేశారు. జిల్లా మొత్తంలో ఒకరికి వాంతులయ్యాయి. మందు వల్లే జరిగిందనే వదంతులు కలచి వేశాయంటారు.
 
నోరు లేని వారి కోసం..

 
డబ్బు, బలం ఉన్నవారు ఏదో ఒక విధంగా తమ పనులు చేసుకుంటారు. పేదలు, బలహీనులకు నోరు కూడా ఉండదు. న్యాయంగా అందాల్సిన పథకాలు దక్కకుండా పోతుంటాయి. అలాంటి వారిని దేవుడైనా ఆదుకోవాలి. ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ప్రభుత్వంలో మనమంటూ ఒక హోదాలో ఉన్నప్పుడు అలాంటి వారికి ఉపకరించే పనులు చే యడం కనీస ధర్మమంటారు సోమేశ్‌కుమార్. ఈ వరుసలోదే డ్రైవర్ కమ్ ఓనర్ పథకం (డ్రైవర్లనే ఓనర్లుగా మార్చేందుకు బ్యాంకు రుణాలిప్పించే పథకం. )తొలిదశలో 105 మంది డ్రైవర్లు ఓనర్లయ్యారు. రెండో దశలో మరో 303 మందికి త్వరలోనే  ఈ పథకం కింద కార్లు ఇవ్వనున్నారు.
 
ప్రేమలో పడ్డారు..

 ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు అలహాబాద్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు డాక్టర్ జ్ఞాన్‌ముద్రతో ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వారి మనసు మారేంత వరకూ వేచి ఉన్నారు.  అలా ఒకటి కాదు...రెండు కాదు..
 ఆరేడేళ్లు వేచి  చూశారు.
 
ప్రశ్న    :    స్పెషలాఫీసర్‌గా బాధ్యత మరింత పెరిగినట్లుంది..!?
జ    :    అవును. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. జీహెచ్‌ఎంసీలో ఉదయం పని ప్రారంభిస్తే.. సాయంత్రానికే ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ దశలో స్పెషలాఫీసర్ కావడంతో బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది.
 
ప్రశ్న    :    పెరిగిన బాధ్యతలతో ఏం చేయాలనుకుంటున్నారు?
 జ    :    పాలక మండలి లేదు. సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు మరోమారు చెప్పేందుకు వీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులు వాటంతటవే పరిష్కారం కావాలనేది లక్ష్యం. అందుకు ప్రయత్నిస్తున్నాను. అవినీతి తగ్గాలి. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి రాజకీయ సంకల్పం కూడా ఉంది. రహదారులు బాగుండాలి. ఒక గమ్యం చేరేందుకు 20 నిమిషాలు పడుతుందనే అంచనా ఉంటే.. అందుకనుగుణంగా రహదారులు ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు. ఈ దిశగా ఆలోచిస్తున్నా.  
ప్రశ్న    :    టీఆర్‌ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే   ఆరోపణలు వస్తున్నాయి..?
 జ    :    ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా పని నేను చేస్తాను. బాధ్యతలు నిర్వర్తిస్తాను. ముఖ్యమంత్రి వద్దకు వివిధ సమీక్ష సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద కార్పొరేషనే కాక... ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా జీహెచ్‌ఎంసీ కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. సీఎం ఆలోచనల అమలుకు యత్నించాలి. ప్రజలకు ఆయన చెప్పినవి చేయాల్సి ఉంటుంది. అందుకు సమన్వయంతో పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన పనులూ చేయాలి. ఒక అధికారిగా వీరందరితో సమన్వయం అవసరం. దాన్ని మరోలా భావిస్తే ఏం చేయాలి?
 
ప్రశ్న    :    మిమ్మల్ని చాలామంది మొండిఘటం అంటారు.. ?

జ    :    నేను  చెప్పేది..చేసేది ఒకటే. ఏదైనా నిజాయితీగా చేస్తాను. నన్ను విమర్శించే వారు సైతం నేను చేసేది కరక్టే అని ఒప్పుకుంటారు. అందువల్లే ఎవరేమనుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనగలుగుతున్నాను.

ప్రశ్న    :    ఉద్యోగులపై కోపం ప్రదర్శిస్తారని?
 జ    :    ఎవరి పనులు వారు చేయాలి. లక్షలాది ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్‌ఎంసీలో ఎన్నో బాధ్యతలుంటాయి. వివిధ ఒత్తిళ్లుంటాయి. ఒక్కరి నిర్లక్ష్యం ఎంతోమందిపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్‌గా చెబుతాను. కచ్చితంగా చేయమంటాను. ఒకసారి, రె ండుసార్లు చె ప్పిచూస్తాను. అయినా వినిపించుకోకుంటే.. ఏం చేయాలి ? వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతానే తప్ప ఇతరత్రా ఉండదు. తమ పనులు సరిగ్గా చేసేవారికి నాతో సమస్య ఉండదు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement