ఇన్‌చార్జి మంత్రులకు ప్రత్యేక నిధి | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి మంత్రులకు ప్రత్యేక నిధి

Published Thu, May 26 2016 3:13 AM

ఇన్‌చార్జి మంత్రులకు ప్రత్యేక నిధి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధి తరహాలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రులకూ ప్రత్యేక నిధి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున దీని కింద విడుదల చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన మొత్తం రూ.238 కోట్లు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి విడుదల చేసేందుకు సన్నద్ధమైంది. ఈ నిధులపై పెత్తనం మంత్రులకే ఉంటుంది.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్‌గా కేటాయించాలా.. లేదా నియోజకవర్గం ప్రాతిపదికగా ఇవ్వాలా... అనే అంశంపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండ్రోజుల కిందట ఈ ఫైలును సీఎం కేసీఆర్‌కు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ రెండు ప్రతిపాదనలతో ప్రణాళిక విభాగం ఫైలు సిద్ధం చేసింది. నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇవ్వటం లేదా జిల్లాకు రూ.25 కోట్ల చొప్పున కేటాయించాలని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుంటే మొత్తం రూ.238 కోట్లు, జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే రూ.250 కోట్లు అవసరమవుతాయని సీఎంకు నివేదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి పథకం (సీడీపీ) నిధులను ప్రభుత్వం ఇటీవలే రూ.3 కోట్లకు పెంచింది. వీటిపై ఇన్‌చార్జి మంత్రుల పెత్తనం తొలిగించిన ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులకు ఈ నిధిని విడుదల చేయనుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులెవరూ లేరు.

 కలెక్టర్లకు రూ.25 కోట్లు...
 ప్రతి జిల్లా కలెక్టర్‌కు క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీడీఎఫ్)లో కేటాయించే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.10 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ఏడాది ఒకే విడతలో ఈ మొత్తం నిధులను విడుదల చేసింది. చాలా జిల్లాల్లో అవి ఖర్చు కానందున.. ఈ ఏడాది నాలుగు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ప్రతి జిల్లాకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.25 కోట్లు నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement