సం‘పూర్ణ’మైన టిఫిన్స్ | Sakshi
Sakshi News home page

సం‘పూర్ణ’మైన టిఫిన్స్

Published Thu, Aug 21 2014 12:02 AM

సం‘పూర్ణ’మైన టిఫిన్స్

 పొగజూరిన గోడల యాంబియన్స్, సోఫాలు, లాంజ్‌లలా సౌకర్యంగా కూర్చోనివ్వని స్టూల్స్, కుర్చీలు... ఇవన్నీ మెత్తని నోట్లో పెడితే కరిగేపోయిన ఇడ్లీ రుచి ధాటికి వెలతెలపోయాయి.
 
సినిమాలతో నాకు పెద్దగా సంబంధం లేదు. అయితే ఒక పనిలాగా కృష్ణానగర్‌కు  వెళ్లడానికి కారణం పూర్ణా టిఫిన్స్. ‘ఫుడీ’గా సిటీలో రెస్టారెంట్స్‌కు వెళ్లి రుచి చూసి వాటి క్వాలిటీపై ఒక నిర్ణయానికి వచ్చేవాడిని నేను. అయితే ఈ టిఫిన్ సెంటర్‌కు ఉన్న పేరు నన్ను అటు వెళ్లేలా చేసింది. ‘పూర్ణా టిఫిన్ సెంటర్’కు ఉన్న ఫాలోయింగ్‌కు చిహ్నంగా కృష్ణానగర్‌లో ఇలా అడగ్గానే అలా చెప్పేశారు దాని అడ్రస్.
 
ఆ టిఫిన్ సెంటర్ చుట్టూ ఉన్న పరిసరాలు చూడగానే పెద్దపెద్ద రెస్టారెంట్స్ పరిచయం ఉన్న నాకు కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. అయితే అక్కడ కనపడే పరిస్థితికి వంటకాల రుచికి అసలు ఏ మాత్రం పోలికే లేదని కాసేపటికే అర్థమైంది. టిఫిన్ సెంటర్‌లోకి ఎంటర్ అవుతుండగానే పెద్దపెద్ద పాత్రల్లో పరాటాలు, దోసెలు తయారవుతున్నాయి. టోకెన్ తీసుకుని కూచున్న కాసేపటికి పొగలు కక్కే తెల్లటి ఇడ్లీలు మా ముందుకు వచ్చాయి. అరిటాకులో బ్రేక్‌ఫాస్ట్... వావ్ అనిపించింది. అరిటాకులో 3 ఇడ్లీలకు నెయ్యి దట్టంగా పట్టించి, వాటిపై కారప్పొడి  (గన్‌పౌడర్) చల్లారు. అల్లం, కొబ్బరి చట్నీలు సరేసరి. పొగజూరిన గోడల యాంబియన్స్, సోఫాలు, లాంజ్‌లలా సౌకర్యంగా కూర్చోనివ్వని స్టూల్స్, కుర్చీలు... ఇవన్నీ మెత్తని నోట్లో పెడితే కరిగేపోయిన ఇడ్లీ రుచి ధాటికి వెలతెలపోయాయి. సహజంగానే అల్లం చట్నీ ఘాటుగా, కొంత తియ్యగా ఉంటుంది. అయితే ఇక్కడ మరింత తియ్యగా ఘాటుగా ఉంది. కొబ్బరి చట్నీ నాణ్యంగా, రుచిగా అనిపించింది. ఇడ్లీలు మాత్రమే కాకుండా దోసెలు, పూరీలు, వడ, బోండాలు... ఇలా అన్ని రకాల టిఫిన్లు అక్కడ వేడి వేడిగా వడ్డిస్తున్నారు.

వాటి నుంచి వస్తున్న పరిమళాలు మాత్రమే కాదు, అక్కడ వాటిని ఆస్వాదిస్తున్న వారిలో వెల్లడవుతున్న భావాలను బట్టి చూసినా... అవన్నీ ఏ పెద్ద రెస్టారెంట్‌కు తీసిపోని... ఇంకా చెప్పాలంటే చాలా రెస్టారెంట్స్ కన్నా మిన్నగా ఉన్నాయని అర్థమైపోయింది.
 సినిమా రంగం అంటే హీరోలు, హీరోయిన్లు, స్టార్లు సెలబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు మాత్రమే కాదు... వెండి తెర ను పండించే సాదా సీదా మనుషులు నిండిపోయిన కృష్ణానగర్ కూడా. అక్కడ వారికి అతి తక్కువ ధరలో అంత మంచి రుచిని వడ్డిస్తున్న పూర్ణా టిఫిన్స్‌ను అభినందించకుండా ఉండలేం. మళ్లీ ఇటొచ్చినప్పుడు తప్పకుండా ఈ టిఫిన్ సెంటర్‌కి వస్తా. ఎందుకంటే ఇడ్లీ, దోసె మాత్రమేనా... మిగతావి కూడా టేస్ట్ చేయాలి కదా.  

Advertisement
Advertisement