శ్రీలంక వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ | Sakshi
Sakshi News home page

శ్రీలంక వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ

Published Sat, Aug 13 2016 3:58 PM

శ్రీలంక వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ

శ్రీలంక ప్రధాని విక్రమసింఘెతో మంత్రి కేటీఆర్ భేటీ
అక్టోబర్‌లో రాష్ట్ర పర్యటనకు విక్రమసింఘె సుముఖత

సాక్షి, హైదరాబాద్: భారత్‌తో కలసి దక్షిణాసియాలో బలమైన శక్తిగా ఎదిగేందుకు శ్రీలంకకు అనేక అవకాశాలు ఉన్నాయని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె వ్యాఖ్యానించారు. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం విక్రమసింఘెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతిని మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్, ఐటీ విధానం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల వివరాలు తెలియజేశారు.

బలమైన శక్తిగా ఎదిగేందుకు శ్రీలంక చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌లోని తెలంగాణతో పాటు ఐదు దక్షిణాది రాష్ట్రాలను వ్యూహాత్మక భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు విక్రమసింఘె వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఐటీ రంగం విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. టీ హబ్ తరహా నమూనాను శ్రీలంకలోనూ అనుసరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన విక్రమసింఘె.. అక్టోబర్‌లో రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
 
ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రతిపాదనలు
శ్రీలంక ప్రధానితో భేటీ సందర్భంగా కేటీఆర్ ఉమ్మడి భాగస్వామ్యానికి సంబంధించి పలు ప్రతిపాదనలు అందజేశారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టడంలో శ్రీలంక కంపెనీలు ప్రధాన భూమిక పోషించాల్సిందిగా కోరారు. కొలంబోలో జరిగిన హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు శ్రీలంక ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ శ్రీలంకకు చెందిన పలు వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. తెలంగాణకు నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సీఈవో కెప్టెన్ సురెన్ రటవట్టెను కోరారు.  మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు.

Advertisement
Advertisement