టీచర్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ కల్పించాలి: జాజుల | Sakshi
Sakshi News home page

టీచర్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ కల్పించాలి: జాజుల

Published Sun, Mar 11 2018 1:50 AM

Srinivas goud about Promotions for teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేవిధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిలు పెట్టేవిధంగా చూడాలని కోరారు. శనివారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీసీ ఉపాధ్యాయ సంఘం (బీసీటీయూ)లో బీసీ ఉపాధ్యాయుల ఫోరం విలీనమైంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 57 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగులు ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలు ఉద్యోగరంగంలో 8 శాతం మాత్రమే ఉండటమేమిటని ప్రశ్నించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడంతో నష్టం జరుగుతోందని అన్నారు.

పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంయుక్త సమావేశం నిర్వహించాలని, లేనిపక్షంలో మరో ‘సకల జనుల సమ్మె’కు ఉద్యోగులు సిద్ధం కావాల్సి వస్తుందని అన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి సురేశ్‌ మాట్లాడుతూ ఏకీకృత సర్వీసులోని అడ్డంకులు తొలగించి ప్రమోషన్లతో కూడిన బదిలీలను ఈ వేసవి సెలవుల్లో చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గిరగాని శ్రీనివాస్‌గౌడ్‌ను బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా నియామించారు.

Advertisement
Advertisement