పదేళ్ల కృషికి ఫలితమీ అవార్డు | Sakshi
Sakshi News home page

పదేళ్ల కృషికి ఫలితమీ అవార్డు

Published Fri, Oct 17 2014 4:39 PM

పదేళ్ల కృషికి ఫలితమీ అవార్డు

పదేళ్లుగా నెల్సన్ మండేలా బొమ్మలను వేస్తూ.. రోజురోజుకూ దానిలో మరింత పరిణితి సాధించానని, ఈ దశాబ్దకాలం నాటి కృషి ఫలితంగానే అంతర్జాతీయ స్థాయిలో కార్టూనిస్టులకు నోబెల్, ఆస్కార్లా భావించే అత్యున్నత అవార్డు తనకు దక్కిందని 'సాక్షి' కార్టూనిస్టు శంకర్ అన్నారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.

ఈ సందర్భంగా 'సాక్షి' యాజమాన్యం శంకర్ను ఘనంగా సత్కరించింది. ఆయనకు రెండు లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని చైర్పర్సన్ వైఎస్ భారతి అందించారు. ఈ సభలో శంకర్ తన అనుభవాలను, చిత్ర నేపథ్యాన్ని వివరించారు. తాను పదిహేడేళ్లుగా ఈ రంగంలో ఉన్నానని, నెల్సన్ మండేలా పోరాట పటిమను ప్రతిబింబించడం, దక్షిణాఫ్రికా నాయకులు వేసుకునే తరహా దుస్తులను చూపించడంతో పాటు.. ఆయన చేసిన పోరాటం (ఎరుపు రంగు) ఆయనకంటే పెద్దదనే భావనను చూపించడం, అందులోనూ సిమెట్రీ సాధించడం, సరిగ్గా మండేలా కన్నుమూసిన మర్నాడే పత్రికలోని సంపాదకీయ పేజీలో ఈ కారికేచర్ ప్రచురితం కావడం.. ఇవన్నీ అవార్డుకు అర్హతలయ్యాయని శంకర్ చెప్పారు. ఈ అవార్డు కోసం తాను గత ఆరున్నరేళ్లుగా ఎంట్రీలు పంపుతున్నానని, ఇన్నాళ్లకు తన కల ఫలించిందని తెలిపారు. ఆసియా దేశాల్లోనే ఎవరికీ ఇంతవరకు ఈ బహుమతి రాలేదని, కనీసం మూడో స్థానం దక్కితే చాలనుకుంటే.. ఏకంగా ప్రథమ బహుమతి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

అవార్డు సాధించిన శంకర్ను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, ఫైనాన్షియల్ డైరెక్టర్ వై.ఇ.పి.రెడ్డి, డైరెక్టర్ మార్కెటింగ్ రాణీరెడ్డి, ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ సీఈవో రామ్, ఇతర సీనియర్ పాత్రికేయులు అభినందనలతో ముంచెత్తారు. శంకర్ను ఘనంగా సత్కరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement