ఇంత నిర్బంధం ఏనాడూ లేదు | Sakshi
Sakshi News home page

ఇంత నిర్బంధం ఏనాడూ లేదు

Published Wed, Oct 19 2016 1:52 AM

ఇంత నిర్బంధం ఏనాడూ లేదు - Sakshi

ప్రతిపక్షం, మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వం: ఉత్తమ్
 
 సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని అమ లు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా గొంతు నొక్కుతోందన్నా రు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా డబుల్ బెడ్రూం, కేజీ టు పీజీ, రిజర్వేషన్లు, రుణమాఫీ సహా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలేవీ అమలు చేయడం లేద న్నారు. ఈ అంశాలన్నింటిపై క్షేత్రస్థాయి ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోందని చెప్పారు.

రుణమాఫీపై 40 లక్షల మంది రైతులను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై 14లక్షల మంది విద్యార్థులను కలవనున్నట్లు తెలిపా రు. ఈ ఉద్యమానికి సహకరించి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పత్రికా సంపాదకులు, టీవీ చానళ్ల సీఈవోలు, బ్యూరో చీఫ్‌లతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ప్రసార మాధ్యమాలపై రాష్ట్ర ప్రభుత్వ అణచివేత అంశాలను ప్రస్తావించారు. గతంలో తాము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వార్తలను కూడా స్వాగతించామని, అందులోని నిజానిజాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ నేడు పత్రికలకు అలాంటి స్వేచ్ఛ లేదని.. మంత్రులు, ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లోనూ కనీసం ప్రశ్నలడిగే పరిస్థితి కూడా లేదని చెప్పారు.

 అన్ని వైపుల నుంచీ ఉద్యమం
 ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఇక క్షేత్రస్థాయి ఉద్యమాలను బలోపేతం చేసే దిశగా వెళుతున్నామని ఉత్తమ్ వెల్లడించారు. ఇందులో భాగంగా 40 లక్షల మంది రైతులు, 14 లక్షల మంది విద్యార్థులను కలసి రుణమాఫీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వినతి పత్రాలు స్వీకరిస్తామని, వాటిని సీఎంకు సమర్పించేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. దీనితోపాటు ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులు, భూసేకరణ 2013 చట్టం అమలుపై అటు న్యాయస్థానాల్లో, ఇటు క్షేత్రస్థాయిలోనూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఆయా అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలు, పోరాటాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాను కోరారు. తాము ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా, ఎన్నిసార్లు సమాచారం కోరినా స్పందన లేదన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పత్రికల్లో వ్యాసాలు రాస్తే తాము కూడా ప్రజల పక్షాన పోరాటాలు ముమ్మరం చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కొన్ని సంస్థలను నిషేధించి, మెడలు విరిచేస్తామంటూ బెదిరించిందని.. పాతిపెడతామని హూంకరించిందని పేర్కొన్నారు. అదంతా పత్రికలను, యాజమాన్యాలను బెదిరించి తన ఆధీనంలోకి తీసుకోవాలనే కుట్రలో భాగమేనని ఆరోపించారు. తొలుత మీడియాలో ప్రజల సమస్యలు, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వార్తలు, వ్యాసాలు వచ్చేవని.. ఇప్పుడు మీడియాలో ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం లేదని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడే బాధ్యతను నిర్వర్తిస్తామని.. మీడియా తరఫున సహకరించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
 
 రాచరిక పాలన

 టీఆర్‌ఎస్ మేనిఫెస్టో తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని కేసీఆర్ చెప్పారని, రోజూ దానిని టేబుల్‌పై పెట్టుకుని పెండింగ్‌లో ఉన్నవాటిని పూర్తిచేస్తామన్నారని... మరి ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం, కేజీటుపీజీ, రుణమాఫీ, రిజర్వేషన్‌లతోపాటు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదన్నారు. పైగా నెలల తరబడి 144సెక్షన్‌ను అమ లు చేస్తూ రాచరిక పాలన సాగిస్తున్నారని అన్నారు. కొత్త రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి రెండున్నరేళ్లుగా ఓపికతో ఎదురు చూశామని.. కానీ కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాటనూ నిలబెట్టుకోలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement