సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట

Published Wed, Apr 13 2016 2:54 AM

సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట - Sakshi

నాంపల్లి కోర్టు వారంట్ అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్:  కేంద్ర మంత్రి సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట లభించింది. మారిషస్ బ్యాంక్ కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. అయితే కింది కోర్టు వారంట్ జారీ చేసినందున మే 5న వ్యక్తిగతంగా ఆ కోర్టు ముందు హాజరై పూచీకత్తులు సమర్పించాలని సుజనాచౌదరిని ఆదేశించింది. తదుపరి విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. అయితే మారిషస్ బ్యాంక్ దాఖలు చేసిన కేసులను కొట్టేయాలన్న సుజనా అభ్యర్థనపై జూన్ 16న పూర్తిస్థాయి విచారణ చేపడతామని పేర్కొంది.

ఈ మేరకు న్యాయమూర్తి రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.106 కోట్ల రుణం చెల్లింపు వ్యవహారంలో మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని, అలాగే ఈ కేసులో తనకు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలంటూ సుజనాచౌదరి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్, మారిషస్ బ్యాంక్ తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు విన్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement