వేసవి కార్యాచరణ ఏదీ! | Sakshi
Sakshi News home page

వేసవి కార్యాచరణ ఏదీ!

Published Wed, Feb 19 2014 5:13 AM

summer plan

 సాక్షి,సిటీబ్యూరో: మండే కాలం సమీపిస్తున్నా.. ‘వేసవి కార్యాచరణ’ సిద్ధం చేయడంలో జలమండలి విఫలమౌతోంది. గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాల్టీల్లో పానీ పరేషాన్‌ను గాలికొదిలేసింది. తక్షణ వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారీలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డుల మధ్య సమన్వయ లేమి కారణంగా ఈ క‘న్నీటి’ కష్టాలను తీవ్రం చేయనుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
 
 మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లోని మంచినీటి కటకట తీవ్రంగా ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, జలమండలి కళ్లు తెరవడంలేదు. సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ లేమి, రోజురోజుకూ అడుగంటుతోన్న భూగర్భ జలాలతో శివారు జనం గొంతెండుతున్నా బోర్డుకు పట్టడంలేదు. ఈ వేసవిలో మహానగరం పరిధిలో 875 కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న సుమారు 35 లక్షల మందికి నిత్యం నీటి కటకట తప్పడంలేదని కాలనీల వాసులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 చేయాల్సిందిదీ...
     జీహెచ్‌ఎంసీ, జలమండలి సమన్వయంతోపాటు, ప్రజాప్రతినిధులు, ఆయా విభాగాల అధికారులతో తక్షణ సమావేశం ఏర్పాటుచేసి వేసవి ప్రణాళిక సిద్ధం చేయాలి.
 
     {పధాన నగరానికి సమానంగా శివారు నిర్వహణ డివిజన్లకు రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించాలి.
 
     యుద్ధప్రాతిపదికన పవర్‌బోర్లు, స్టాటిక్ ట్యాంకులు, పబ్లిక్ నల్లాలకు మరమ్మతులు చేయాలి.
     అవసరమైన చోట పవర్ బోర్లు వేయాలి.
 
     సరఫరా నెట్‌వర్క్ లేని వందలాది కాలనీలు, బస్తీలకు రోజువారీ నీటి సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లకు అదనంగా మరో 100 ట్యాంకర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.
 
     అరకొర నీటిసరఫరా, తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా, నీటి కటకటపై జలమండలి కాల్‌సెంటర్‌కు అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలి. ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల దాహార్తిని తీర్చాలి.
 
     ఆయా జలాశయాల నుంచి తరలిస్తున్న నీటిలో 40 శాతంగా ఉన్న వృథాను.. 20 శాతానికి తగ్గించాలి
     {పజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, వార్డు కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని తక్షణ కార్యాచరణలో పొందుపరచాలి.
 

Advertisement
Advertisement