పన్ను బకాయిలపై టార్గెట్‌! | Sakshi
Sakshi News home page

పన్ను బకాయిలపై టార్గెట్‌!

Published Sun, Jul 16 2017 3:42 AM

పన్ను బకాయిలపై టార్గెట్‌!

- బేస్‌ రెవెన్యూ పెంపు కోసం వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు
బకాయిల వసూళ్లకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగానికీ సిద్ధం
ఇప్పటికే రాష్ట్రంలోని వందల మంది డీలర్లకు నోటీసులు
రూ.350 కోట్లకుపైగా వసూలు చేయాలని నిర్ణయం
జీఎస్టీ అమలు నేపథ్యంలో పరిహార పన్ను లబ్ధిపై దృష్టి
 
సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల మూల ఆదాయాన్ని (బేస్‌ రెవెన్యూ) పెంచుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూల ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా వీలైనంత మేర కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్న యోచనతో.. పెండింగ్‌ బకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. ముఖ్యంగా 2009–10 నుంచి 2016–17 మధ్య బకాయిపడ్డ డీలర్ల నుంచి వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రంలోని వందలాది మంది డీలర్లకు ఇప్పటికే నోటీసులిచ్చారు. రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూడా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
 
మొండి బకాయిలపై దృష్టి..
వాణిజ్య పన్నుల చెల్లింపు ప్రక్రియలో పన్నులు పెండింగ్‌ పడడం, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిని ఏటా గుర్తించడం సాధారణంగా జరుగుతుంటుంది. వీటినే డిక్లేర్డ్, డిటెక్టెడ్‌ పన్నులు అంటారు. తాజాగా వీటిని వసూలు చేయడంపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ.. వందల మంది డీలర్లకు నోటీసులు జారీ చేసింది. మొత్తంగా 2 నెలలు గా బకాయిలపై కసరత్తుచేసి న పన్నుల శాఖ ఉన్నతాధికా రులు.. రూ.350 కోట్ల వరకు రావాల్సి ఉందని గుర్తించారు.
 
వచ్చే మార్చికల్లా రూ.14,037 కోట్లు
జీఎస్టీ అమలు నేపథ్యంలో రాష్ట్రాల పన్ను రాబడి లెక్కలను తేల్చేందుకు తీసుకొనేందుకు 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఆ ఏడాది వాణిజ్య పన్నుల ఆదాయం రూ.16,201 కోట్లుగా లెక్కించారు. అక్కడి నుంచి ఏటా 14శాతం పెంపును చేర్చుతూ.. ఆ మేరకు పన్ను రాకపోతే తగ్గిన మొత్తం మేరకు కేంద్రం అందజేస్తుంది. ఈ లెక్కన రాష్ట్రానికి 2017–18లో రూ.21,055 కోట్లు ఆదాయం రావాలి. అయితే ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున.. ఆ తేదీ నుంచి వచ్చే మార్చి వరకు రూ.14,037 కోట్లు పన్నుల కింద రావాలి. మరోవైపు వాణిజ్య పన్నుల శాఖ ఈ ఏడాది పన్ను వసూళ్ల టార్గెట్‌ను రూ.32 వేల కోట్లుగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వీలైనంత మేరకు పన్నులు వసూలు చేసి, ఈ ఏడాది లెక్క చూపించగలిగితే వచ్చే ఏడాదికి అంత లబ్ధి కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement