నేరుగా క్రమబద్ధీకరించలేం | Sakshi
Sakshi News home page

నేరుగా క్రమబద్ధీకరించలేం

Published Tue, Sep 2 2014 2:04 AM

నేరుగా క్రమబద్ధీకరించలేం

కాంట్రాక్టు ఉద్యోగులు 13,671 మందే: యనమల
మీ మంత్రే 32 వేల మంది ఉన్నారన్నారు
నిలదీసిన పలువురు సభ్యులు

 
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రాక్టు ఉద్యోగులందరినీ నేరుగా క్రమబద్ధీకరించాలంటే కుదరదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ పరిధి మేరకు నడుచుకోవాలి. అయినా మేం క్రమబద్ధీకరణ విషయూన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆయన మాట్లాడుతూ తాము క్రమబద్ధీకరణ చేయలేమని అనట్లేదని, ఆ విషయం పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు.
 
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని,  అందుకే ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు వేరు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేరని స్పష్టం చేశారు. సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు కాంట్రాక్టు పరిధిలోకి రారని చెప్పారు.
 
మంత్రుల మధ్య విరుద్ధ ప్రకటనలా?
ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తారా? అంటూ పలువురు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి నేత ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రుల మధ్యే స్పష్టత లేదన్నారు. ఇదే సభలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు 32,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని చెప్పారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి 13,671 మంది మాత్రమే ఉన్నారని చెబుతున్నారని అభ్యంతరం తెలిపారు.
 
రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మృతులు ఇద్దరేనని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించటాన్ని ఎమ్మెల్సీ గేయానంద్ సవాల్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 42 మంది మృతి చెందారని, కావాలంటే నిరూపిస్తానన్నారు.  

రాష్ట్రవాప్తంగా 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా 202 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
వక్ఫ్ భూములకు సంబంధించి 24 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement