టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది? | Sakshi
Sakshi News home page

టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?

Published Tue, Feb 16 2016 3:09 AM

టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అమలు చేయడం లేదంటూ న్యాయవాది జె.కె.రాజు 2013లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సంబంధిత అంశాల్లో నిజానిజాలను తేల్చాలంటూ ఒక పర్యవేక్షణ కమిటీని నియమించింది.

ఈ కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనం జరిపి మౌలిక సదుపాయాలు లేని మాట వాస్తవమేనని, అయితే అంతకంటే ముందు పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని సుప్రీంకోర్టుకు నివే దించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేకపోతే ఎలా అంటూ సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలను గత అక్టోబర్‌లో ప్రశ్నించింది. వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. టీచర్ల భర్తీ తీరుతెన్నులపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది.

తాజాగా సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణలో టీచర్ల భర్తీని జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి కోర్టుకు విన్నవించారు. భర్తీకి తీసుకున్న చర్యలేంటో సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఫలితాలు కూడా వెలువడ్డాయని, మరికొన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విన్నవించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 14కు వాయిదా వేసింది.

 జవాబుదారీతనం ఎక్కడ?
 ఇదే కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఫెడరేషన్ అధ్యక్షుడు జె.సాగర్‌రావు తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 28,707 ప్రభుత్వ పాఠశాలల్లో 1,11,877 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించేందుకు వీల్లేదు. కానీ ఉపాధ్యాయులు శాసన సభ్యులకు వ్యక్తిగత సహాయకులుగా, ప్రత్యేక విధులు నిర్వర్తించే అధికారులు(ఓఎస్డీ)గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉపాధ్యాయులు సీఎం కార్యాలయంలో, మంత్రుల కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యాయుల వేతనాలపై నెలకు రూ.558.29 కోట్లు వెచ్చిస్తోంది. ఉపాధ్యాయుల వేతనాలు రూ.26 వేల నుంచి రూ.1.10 లక్షల వరకూ ఉన్నాయి. సగటున ఒక్కో ఉపాధ్యాయుడిపై రూ.50 వేలు ఖర్చు చేస్తోంది. 90 శాతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. అందువల్ల పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. యూనియన్ నేతలు ఆన్ డ్యూటీ పేరుతో వేతనాలు అందుకుంటున్నారు. కానీ తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మరోవైపు ఫీజుల భారం భరించలేక రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో జవాబుదారీతనం ఉండేలా చూడాలి’’ అని పిటిషన్‌లో విన్నవించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement