పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని.. | Sakshi
Sakshi News home page

పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని..

Published Sat, Oct 15 2016 8:43 AM

పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని.. - Sakshi

కడ్తాల్: కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ పంచాయితీ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో 19 సంవత్సరాల ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భవతయిందనే కోపంతో తల్లి, అన్నలు మానవత్వం మరచి.. తోబుట్టువు అని చూడకుండా సొంత చెల్లెలిని తీవ్రంగా కర్రతో కొట్టి చంపారు. మృతి చెందిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు. విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో, రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం తండాను సందర్శించి కుటుంబ సభ్యులను విచారించారు.

సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కడ్తాల మండలం మైసిగండి పంచాయితీ పరిధిలోని వెలుగురాళ్ల తండాకు చెందిన దేవుల సోని దంపతులకు ముగ్గురు కుమారులు రవి, జగన్, బబ్లూలు, కుమారై మంజుల ఉన్నారు. మంజుల గత కొంత కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలోని బందువుల ఇంట్లో ఉంటుంది. గత పదిహేను రోజుల క్రితమే మంజులను తల్లి సోని తండాకు తీసుకు వచ్చింది. వివాహం కాకుండానే మంజుల గర్భం దాల్చడంతో ఈ నెల 12న తల్లి, సోదరులు బబ్లూ, జగన్‌లు మంజులను ప్రశ్నించారు. ఆమె నుండి సరైన సమాధానం రాకపోవడంతో తల్లితో పాటు, బబ్లూ, జగన్‌లు మంజులను కర్రలతో తీవ్రంగా కొట్టారు. మృతి చెందిన తర్వాత తమ సొంత వ్యవసాయ పోలానికి తీసుకువెళ్లి, నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని తండా వాసులను నమ్మించారు.

మృతదేహన్ని తీసుకువెళ్లి గురువారం ఉదయం తమ వ్యవసాయ పొలంలో పూడ్చిపెట్టారు. విషయం బయటికి రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారి ఫిర్యాధుతో సైబరాబాద్ అసిస్టెంట్ కమీషనర్ అనురాధ, సీఐ రవీంద్రప్రసాద్, ఎస్‌ఐలు రామలింగా రెడ్డి, సురేశ్‌యాదవ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి సోని, సోదరులు బబ్లూ, జగన్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. పూడ్చి పెట్టిన చోటును గుర్తించి, తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో మతదేహన్ని వెలికితీశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడితో అక్కడే పోస్టుమార్టం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఎసీపీ అనురాధ, సీఐ రవీంద్రప్రసాద్‌లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement