తెలంగాణలో ఎయిమ్స్‌కు కృషి | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎయిమ్స్‌కు కృషి

Published Mon, May 9 2016 1:13 AM

తెలంగాణలో ఎయిమ్స్‌కు కృషి

♦ ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ: దత్తాత్రేయ
♦ వైద్య, ఆరోగ్య పరిస్థితులపై మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్:
ప్రతిష్టాత్మకమైన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ఆదివారం మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో ఈఎస్‌ఐసీ కార్యాలయం లో దత్తాత్రేయ సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వంటి జ్వరాల బారిన పడి ఏటా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వ్యాఖ్యానించా రు. ఇక బస్తీల్లో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... రాష్ట్రాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో విలువైన పరికరాలకు కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో కార్మికులకు వార్డులు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చిందని, దీనిపై ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చించి ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పదిశాతం మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులున్నారని, వారికి మెరుగైన చికిత్స అందజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కేన్సర్ ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్, టీబీ స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

 అసంఘటిత కార్మికులందరికీ ఈఎస్‌ఐ..
 అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ విడతల వారీగా ఈఎస్‌ఐ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణాలకు సంబంధించి సెస్ రూపంలో రూ.21వేల కోట్లు వసూలయ్యాయన్నారు. కానీ అందులో రూ.3వేల కోట్లు మాత్రమే కేంద్రానికి చేరాయని, మిగతా నిధులు రాష్ట్రాల వద్దే ఉండిపోయాయని... ఆ నిధులన్నీ కేంద్రానికి చేరినట్లయితే మంచి సంక్షేమ పథకాలు అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈఎస్‌ఐ బ్లాకులు ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్రం సహకారంతో ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవీఎస్ మూర్తి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్‌ఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి సూపరిటెండెంట్ జయలలిత తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement