Sakshi News home page

కొత్త జిల్లాలపై అభ్యంతరాల వెల్లువ

Published Mon, Aug 29 2016 8:39 PM

కొత్త జిల్లాలపై అభ్యంతరాల వెల్లువ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ముసాయిదా రూపొందించిన ప్రభుత్వం దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను కోరిన విషయం తెలిసిందే. ఆమేరకు ఆగస్టు 22 న జిల్లాల వారిగా కొత్త సరిహద్దులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలపై వేలాదిగా స్పందిస్తున్నారు. ప్రధానంగా ఇదివరకు ఉన్న జిల్లాలో కాకుండా తమ మండలాన్ని మరో జిల్లాలో కలపడం, జిల్లాను విభజించి రెండుగానో అంతకన్నా ఎక్కువగానో ప్రతిపాదించిన వాటిల్లో ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఆన్ లైన్ లో పది వేల వరకు (సోమవారం రాత్రి వరకు 9,500) అభ్యంతరాలు నమోదయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించడానికి ప్రభుత్వం న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ పేరుతో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పోర్టల్ ద్వారా ఇప్పటికే 9500 అభిప్రాయాలు నమోదు కాగా, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం 30 రోజుల గడువు విధించింది. తొలి వారంలో పది వేల మేరకు అభ్యంతరాలు నమోదు కాగా ప్రజల్లో కొత్త జిల్లాలపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి.

సిరిసిల్ల, జనగామ, గద్వాల వంటి చోట్ల నుంచి తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సిరిసిల్లను జిల్లాగా చేయాలని స్థానిక మంత్రి కేటీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కోరడంతో ఆ ప్రాంత వాసుల్లో జిల్లా ఏర్పాటుపై ఆశలు పెరిగాయి. తీరా ముసాయిదాలో సిరిసిల్ల లేకపోవడంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అలాగే జనగామను జిల్లా చేయాలని అక్కడివారు మొదటి నుంచి ఆందోళన బాట పట్టారు.

ఈ రకంగా జిల్లాల డిమాండ్లతో పాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, తమ మండలాన్ని ఫలానా జిల్లాలో కలపొద్దని, తమ మండలాన్ని కొత్త జిల్లాలో కలపడం ఇబ్బంది కరంగా ఉందని... ఇలా రకరకాల అభ్యంతరాలతో పాటు కొత్త జిల్లాల రూపురేఖలపై అనేక సూచనలు ప్రజల నుంచి అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ లో తెలియజేసిన సూచనలు, అభ్యంతరాల వివరాలు ప్రజలకు తెలియవు. గడువు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వాటన్నింటిని వెల్లడిస్తుందా? లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

Advertisement

What’s your opinion

Advertisement