Sakshi News home page

భూగర్భ పంప్‌హౌస్‌తో భారమెంత?

Published Mon, Jul 18 2016 1:12 AM

Telangana govt to vision of Pump house construction on Underearth

తేల్చే బాధ్యత ఎస్కీకి అప్పగింత
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒకటో ప్యాకేజీలో చేపట్టే పంప్‌హౌస్ నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపరితల పంప్‌హౌస్‌కు బదులు భూగర్భ పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ పంప్‌హౌస్ నిర్మాణం వల్ల రూ.300 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అధికారులు చెబుతుండగా, రూ.వెయ్యి కోట్లపైనే అని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో భూగర్భ పంప్‌హౌస్ భారాన్ని తేల్చే బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ)కి అప్పగించింది.  ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను రూ.3,224.33 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పనులను కాంట్రాక్టు ఏజెన్సీలు రూ.3,208 కోట్లకు టెండర్‌ను దక్కించుకున్నాయి. అధికారులు ముందుగా ప్రతిపాదించిన పంపింగ్ స్టేషన్ కల్వకుర్తి పంపింగ్ స్టేషన్‌కు 1.25 కిలోమీటర్ల దూరాన తూర్పు ప్రాంతంలో ఉంది.
 
 ఈ ప్రాంతంలో 287 ఎకరాల మేర అటవీ భూమి ఉన్న నేపథ్యంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణస్థలాన్ని మార్చాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. కల్వకుర్తి పంప్‌హౌస్‌కు 300 మీటర్ల దూరాన పశ్చిమాన నిర్మాణం చేయాలని, భూఉపరితలంలో కాకుండా భూగర్భంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది. ఇలా అయితే, భారం రూ.300 కోట్లు ఉంటుందని తేల్చగా, అటవీ, భూసేకరణ సమస్యలను తప్పిస్తున్నందున రూ.70 నుంచి రూ.80 కోట్లు మిగులుతాయని, ఈ లెక్కన అదనపు భారం రూ.50 కోట్లకు మించదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement