'టీడీపీది చిల్లర రాజకీయం' | Sakshi
Sakshi News home page

'టీడీపీది చిల్లర రాజకీయం'

Published Tue, Jun 3 2014 12:46 PM

'టీడీపీది చిల్లర రాజకీయం' - Sakshi

టీడీపీ చిల్లర రాజకీయం చేస్తుందని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్పై విమర్శలు చేయడం తగదని ఆయన టీడీపీకి హితవు పలికారు. కేసీఆర్ తన కేబినెట్ విస్తరణ మరోసారి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకోసమే ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రైతుల రుణమాఫీని అమలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు.


తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్... తన మంత్రివర్గంలో కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టి... ఆస్తి పంచుకున్నట్లు మంత్రి పదవులు  పంచుకున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో విమర్శించారు. కేసీఆర్ తన కేబినెట్లో 25 శాతం మంత్రి పదవులు తన బంధువులకే ఇచ్చి, మంత్రివర్గాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు గానీ, గిరిజనుడికి గానీ స్థానం కల్పిం చలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్ మంగళవారంపై విధంగా స్పందించారు.

Advertisement
Advertisement