తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి | Sakshi
Sakshi News home page

తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి

Published Mon, Jan 25 2016 4:02 AM

తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి

‘నవలకు నీరాజనం’లో యద్దనపూడిని కొనియాడిన వక్తలు
 
 హైదరాబాద్: తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి అని వక్తలు కొనియాడారు. యువతలో కల్పనా భావం పెంపొందించేందుకు ఆమె రచనలు దోహద పడతాయని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల కింద ఆమె రచించిన ‘సెక్రటరీ’ నవల సంచలనం సృష్టించి నేటికీ పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచిందని కొనియాడారు. సెక్రటరీ నవల స్వర్ణోత్సవం సందర్భంగా లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ లో జరిగిన ‘నవలకు నీరాజనం’ కార్యక్రమానికి శివారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఓ నవల స్వర్ణోత్సవంతో పాటు 90 ముద్ర ణలకు నోచుకోవడం దేశ చరిత్రలోనే లేదని, సెక్రటరీ నవల ఈ ఘనతను తొలిసారిగా దక్కించుకుందని పేర్కొన్నారు. విశిష్ట అతిథి ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, యువత మ నస్తత్వానికి అద్దంపట్టేలా అప్పట్లోనే సులోచనారాణి రచనలు చేశారని చెప్పారు. ఆత్మగౌరవంతో పాటు గౌరవప్రదంగా జీవించాలనుకునే మనస్తత్వమున్న పాత్రలు ఆమె రచనల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. సెక్రటరీ నవల 90వ ముద్రణను ప్రముఖ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ ఆవిష్కరించారు.

సులోచనా రాణి అనేక నవలలు సినిమాలుగా వచ్చినా, తాను మాత్రం ఆమె నవలలను సినిమాగా తీయలేకపోయానని చెప్పారు. పాఠకులు చూపిస్తున్న అభిమానానికి హృదయం ఉప్పొంగిపోతోందని సులోచనా రాణి పేర్కొన్నారు. ఒకప్పుడు రచయిత్రుల రచనలు అంతగా ప్రాచుర్యం పొందలేదని, సెక్రటరీ నవలతోనే రచయిత్రుల యుగం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశ లో రచయిత్రుల పేర్లతో నవలలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. 1965లో సీరియల్‌గా వచ్చిన సెక్రటరీ నవల అదే ఏడాది పుస్తకం గా వచ్చిందని, ఈ పుస్తకం 90 ముద్రణలకు నోచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కింద స్త్రీ మనసు ఏ ప్రేమను కోరుకుందో నేటి స్త్రీ మనసు కూడా అదే ప్రేమను కోరుకుం టోందని చెప్పారు. ఈ సందర్భంగా సులోచనారాణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జ్యోతి మాస పత్రిక సంపాదకుడు లీలావతిరాఘవయ్య, ఎమెస్కో పబ్లిషర్ ధూపాటి విజయకుమార్, టీవీ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు, సుధాకర్ పల్లమాల, మృణాళిని, కళాదీక్షితులు, ప్రముఖ నాట్య కళాకారిణి వింజమూరి సుజాత, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభంలో స్నేహలత మురళి బృందం జానపద నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement