కాపు ఉద్యమంతో ఇరకాటంలో టీడీపీ | Sakshi
Sakshi News home page

కాపు ఉద్యమంతో ఇరకాటంలో టీడీపీ

Published Mon, Feb 1 2016 5:59 PM

కాపు ఉద్యమంతో ఇరకాటంలో టీడీపీ - Sakshi

హైదరాబాద్ : చట్టపరమైన రిజర్వేషన్లు కావాలని కాపు సామాజిక వర్గం సాగిస్తున్న ఉద్యమంపై అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఉద్యమాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంటే... మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగా డీల్ చేయలేదన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ విషయంలో తొలి నుంచి దాటవేత ధోరణి ఇంతటి పరిస్థితికి తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తునిలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు తాజాగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించడంపై టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయంగా పార్టీకి ఈ పరిణామం ఒక పెద్ద దెబ్బగా ఆ పార్టీ నేతలు అంచనాకొచ్చారు. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న తర్జనభర్జన సాగిస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పార్టీలో కొందరు సన్నిహిత నేతలు, కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన క్యాంపు కార్యాలయానికి పిలిచి ఉద్యమానికి కౌంటర్ ఎలా ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరిపారు.

కాపు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరపడుతున్నా ఉద్యమం చేస్తామన్న ప్రకటన వెలువడిన తర్వాత కాపు కార్పొరేషన్ పదవిని భర్తీ చేయడంపై టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఒక సామాజిక వర్గంపై తక్కువ అభిప్రాయం, తప్పుడు అంచనాలే ఇంతవరకు తెచ్చాయని అంటున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరినీ సమావేశపరిచి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదని సీనియర్ నేత ఒకరన్నారు. పైగా రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కాలయాపన చేయడం కూడా నష్టం తెచ్చిందని, ఇంతజరిగిన తర్వాత చట్టంలో ఉన్న ప్రతిబంధకాల గురించి ముఖ్యమంత్రి చెప్పడం ఆ సామాజిక వర్గాల్లో మరింత కోపం తెప్పించేదిగా ఉందని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement