ఉలకని కేంద్రం.. అందని సాయం | Sakshi
Sakshi News home page

ఉలకని కేంద్రం.. అందని సాయం

Published Mon, Jan 11 2016 2:59 AM

ఉలకని కేంద్రం.. అందని సాయం - Sakshi

♦ పదేపదే అడిగినా జాడ లేని కరువు సాయం
♦ కేంద్ర బృందం పర్యటించి నెల రోజులు దాటినా చర్యలు శూన్యం
♦ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం
♦ గతవారం ఏపీ, యూపీ, ఒడిశాకు నిధుల విడుదల
♦ కరువు ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న రైతులు
 
 సాక్షి, హైదరాబాద్: కరువు సాయం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంక కన్నెత్తి చూడటం లేదు! తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో కరువు సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలన్నర కిందట నివేదిక పంపించినా ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈ నెలన్నర  వ్యవధిలో ప్రభుత్వ పెద్దలు మూడుసార్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సారథ్యంలో మంత్రుల బృందం, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం.. ఇలా మూడుసార్లు హస్తిన వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర హైపవర్ కమిటీ తెలంగాణకు కరువు సాయంపై నిర్ణయం వెల్లడించకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలను మరింత విస్మయానికి గురి చేసింది. అదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.433 కోట్ల కరువు సాయం మంజూరుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు సైతం కరువు సాయం అందించాలని ఆ భేటీలో నిర్ణయించారు. అదేరోజున నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను కలిసి కరువు సాయం వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

 రాష్ట్రంలో పర్యటించి నెల దాటినా..
 తీవ్ర వర్షాభావ పరిస్థితులుండటంతో రాష్ట్రం లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ నవంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు తగినంత సాయం చేయాలని కోరుతూ అదే రోజున కేంద్రానికి నివేదిక పంపింది. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రుల బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి విన్నవించింది. డిసెంబర్ 7, 8 తేదీల్లో కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండ్రోజులు వివిధ జిల్లాల్లో పర్యటించింది.

తగినంత సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృందాన్ని కోరారు. అయితే నెలకుపైగా గడిచిపోయినా కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదు. కరువు సాయం వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రాన్ని మరోమారు అభ్యర్థించారు. స్వయంగా వెళ్లి రావాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారంను ఢిల్లీకి పంపారు. అయినా స్పందన లేదు. ఇటీవల మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ వర్సిటీ శంకుస్థాపనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనూ ఈ ప్రస్తావన రాలేదు.

 ప్రతిపాదనల లేటుతోనే జాప్యం
 కరువు ప్రతిపాదనలు సిద్ధం చేసే ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరిగిందని, అందుకే కేంద్రం నుంచి సాయం అందటం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకముందే స్పందించాయి. కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులకు సొంతంగా ఆర్థిక సాయం ప్రకటించాయి. ఒడిశా సర్కారు 12 జిల్లాలను కరువుగా ప్రకటించి, వాటికి రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర సాయం కంటే ముందే రూ.200 కోట్ల ఆర్థిక ప్యాకేజీని రైతులకు ఇచ్చింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే ముందే కరువును ప్రకటించి కేంద్ర సాయం అందుకునే రేసులో ముందు నిలిచాయి. రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందిన వరుస క్రమంలోనే కేంద్రం కరువు సాయం అందిస్తోందని, అందుకే తెలంగాణకు నిధులివ్వడం ఆలస్యమవుతోందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
 
 సాయం కోసం రైతుల నిరీక్షణ
 కరువు ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు, తాగునీరు, ఉపాధి, పింఛన్ల చెల్లింపులకు రూ.3,002 కోట్లు కావాలని కోరుతూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ విభాగాల వారీగా సమగ్ర నివేదికను కేంద్రానికి పంపింది. కనీసం అందులో మూడో వంతు సాయమైనా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ కరువు ప్రాంతాల్లోని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్‌పుట్ సబ్సిడీ చేతికందితే పంటల పెట్టుబడులకు ఆసరాగా ఉంటుందని ఆశతో నిరీక్షిస్తున్నారు. కానీ రాష్ట్రం కేంద్రం వైపు చూస్తుండటంతో కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలన్నీ పెండిం గ్‌లో పడ్డాయి.

Advertisement
Advertisement