‘సైబర్’ ట్రిక్స్ | Sakshi
Sakshi News home page

‘సైబర్’ ట్రిక్స్

Published Fri, Mar 4 2016 12:25 AM

‘సైబర్’ ట్రిక్స్

మారుతున్న నేరగాళ్ల పంథా..
సందర్భానికి తగ్గట్టు మాటలు చెప్తూ టోకరా
13 మంది అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ కాప్స్

 
సెల్‌ఫోన్, ఆన్‌లైన్ కేంద్రంగా నేరాలు చేసే సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ అవుతున్నారు. పాత పంథాలను ‘డిలీట్’ చేస్తూ... సరికొత్త తెలివితేటల్ని ‘యాడ్’ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్‌లు పంపి అందినకాడికి ‘సెట్టింగ్’ చేసే వాళ్లు... ఇప్పుడు తమ నేర ‘వెర్షన్’ను ‘అప్‌గ్రేడ్’ చేస్తూ వినియోగదారులకు అనుమానం వచ్చే అంశాలను ‘ఎడిట్’ చేసుకుంటున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గడిచిన పక్షం రోజుల్లో నాలుగు నేరాలకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు. ఇవన్నీ సరికొత్త పంథాల్లో సాగిన సైబర్ క్రైమ్స్ అని అధికారులు చెబుతున్నారు. కేవలం అప్రమత్తంగా ఉండటమే సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ఉండేందుకు ఉత్తమమైన మార్గమని వివరిస్తున్నారు.  - సాక్షి, సిటీబ్యూరో
 
బ్రేక్ తర్వాత మళ్లీ..
ఓ వ్యక్తిని వల్లో వేసుకున్న తర్వాత అందినకాడికి దండుకుని ఆపై ‘స్విచ్ఛాఫ్’లో ఉండిపోవడం ఆన్‌లైన్ జాబ్ ఫ్రాడ్‌గాళ్ల పాత విధానం. ఇప్పుడు ‘బ్రేకు’ల తర్వాత కొనసాగింపులూ ఉంటున్నాయని స్పష్టమైంది. నగరానికి చెందిన జితేందర్ అనే బ్యాంకు ఉద్యోగికి లండన్‌లో జాబ్ చేయూలని కోరిక. దీంతో ఆన్‌లైన్‌లో ఉన్న జాబ్ ఆఫరింగ్ సైట్లలో తన బయోడేటా పొందుపరిచాడు. ఈయనకు కొన్నాళ్ల క్రితం ‘జాబ్ టు గ్లోబ్’ అనే వెబ్‌సైట్ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఫ్రొఫైల్‌ను ఫలానా సైట్‌లో చూశామని, తమ దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే లండన్‌లో ఉన్న రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌లో ఉద్యోగం సిద్ధంగా ఉందని చెప్పారు. దీంతో జితేందర్ అలానే చేశాడు. ప్రాసెసింగ్ ఫీజ్ పేరుతో రూ.5 వేల నుంచి సైబర్ నేరగాళ్లు ‘డిపాజిట్లు’ సేకరించడం ప్రారంభించారు. విడతల వారీగా జితేందర్ నుంచి మొత్తం రూ.53 లక్షల స్వాహా చేశారు. ఢిల్లీకి చెందిన ఈ సైబర్ నేరగాళ్లను అక్కడి పోలీసులు వేరే కేసులో అరెస్టు చేశారు. మూడు నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన ముఠా సభ్యులు మళ్లీ జితేందర్‌ను ‘ప్రాసెసింగ్’ అంటూ సంప్రదించారు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో నోయిడాకు చెందిన మనోజ్‌కుమార్, సుశీల్‌సింగ్ అరెస్టు అయ్యారు. ప్రధాన సూత్రధారి మాత్రం పరారీలోనే ఉన్నాడు.
 
ఒకే పాలసీ..  పదేపదే కాల్స్..
సిటీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మల్లయ్యను ఢిల్లీ ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతోనే బురిడీ కొట్టించింది. అప్పటికే మెచ్యూర్ అయి, నగదు తీసుకున్న పాతసీపై బోగస్ అంటూ ఒకటికాదు, రెండుకాదు... పదేపదే ఫోన్లు రావడంతో మల్లయ్య నమ్మారు. ‘ఫీజు’లు అంటూ రూ.20 వేలతో ప్రారంభించిన ముఠా ఆయన నుంచి మొత్తం రూ.8 లక్షలు స్వాహా చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విపుల్‌సాని, అశోక్, షాన్ మహ్మద్, మనీష్, వరుణ్ యాదవ్‌లను ఢిల్లీలో అరెస్టు చేసి తీసుకువచ్చారు.
 
వెబ్‌సైట్‌తో ఒప్పందాలు...
కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి... ‘లిమిట్ పెంచుతున్నాం, డేటాను అప్‌గ్రేడ్ చేస్తున్నాం..’ అంటూ క్రెడిట్‌కార్డు వినియోగదారులకు ఫోన్లు చేయడం పాతస్టైలే. ఈ రకంగా సేకరించిన డేటాను వినియోగించి ఆన్‌లైన్‌లో ఖరీదు చేసి టోకరా వేసేవారు. ఈ ‘కాల్‌నాగులు’ ఇటీవల కాలంలో తమ పంథా మార్చారని తాజా ఘటనల్లో తేలింది. వెబ్‌సైట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని పక్కా లీగల్‌గా పుట్టెవుుంచుతున్నారు. ఢిల్లీకి చెందిన దినేష్ లక్రా, ప్రమోద్‌లు అక్కడి నారాయణ ప్రాంతంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ‘పని’ ప్రారంభించారు. ఈ-షాప్ ట్రిక్స్ వెబ్‌సైట్ నిర్వాహకులైన మనోజ్, హర్షిత్‌లతో వీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన కార్డ్ డేటాతో ఈ వెబ్‌సైట్‌లో కనిష్టంగా రూ.7 వేలకు ఓ ప్యాక్‌ను ఖరీదు చేస్తారు. నాసిరకం షూస్, కళ్లజోడు, పర్సులతో కూడిన ఈ ప్యాక్‌ను వినియోదారుడికే పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా సదరు వినియోగదారుడే తన కార్డుతో ఖరీదు చేసినట్లు బుకాయించే అవకాశం ఉంటుంది. వినియోగదారుడి కార్డు నుంచి స్వాహా చేసిన మొత్తంలో ఈ ప్యాక్ ఖరీదు పోను మిగిలిన దాంట్లో 65 శాతం వెబ్‌సైట్ నిర్వాహకులు, 35 శాతం కాల్‌సెంటర్ నిర్వాహకులు పంచుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదుకావడంతో దినేష్, ప్రమోద్, మనోజ్, హర్షిత్ కటకటాల్లోకి చేరారు.
 
చెక్కులిస్తారు.. పేమెంట్లు ఆపవుంటారు..

ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్‌లంటూ ఫోన్ల ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే ఢిల్లీ ముఠాలు ఇటీవల కాలంలో వలవేసిన వారిలో నమ్మకం పెంచడానికి చెక్కుల్నీ జారీ చేస్తున్నాయి. అయితే ఓ పక్క చెక్కులు పంపిస్తూనే... మరోపక్క వాటిని ‘స్టాప్ పేమెంట్’ చేయాలంటూ బ్యాంకులకు లేఖలు రాసి కథ నడిపిస్తున్నాయి. విజయ్‌నగర్‌కాలనీకి చెందిన ఓ మాజీ ఎమ్మార్వోకు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇది మెచ్యూర్ కావడంతో ఆయనకు రూ.10 లక్షలు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ బ్యాంకు హెడ్-ఆఫీస్ నుంచి అంటూ ఓ ఫోన్ వచ్చింది. వాస్తవానికి మీ పాలసీపై రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉందని, అయితే ఏజెంట్లు కమీషన్లు తీసుకోవడంతో ఆ మొత్తం తగ్గిందంటూ సైబర్ నేరగాళ్లు ఎరవేశారు. ఆ మొత్తం పొందడానికి పది శాతం రిఫండబుల్ డిపాజిట్ చేయాలన్నారు. తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.60 వేలు డిపాజిట్ చేయించుకుని రూ.6 లక్షల చెక్కు పంపారు. దీన్ని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించగా... ‘స్టాప్ పేమెంట్’ చెక్కని బ్యాంకు వారు చెప్పారు. దీంతో మళ్లీ నేరగాళ్లను సంప్రదించగా... మొత్తం రూ.40 లక్షలూ ఒకే చెక్కు ఇవ్వడానికే ఆ చెక్కుపై అలాంటి చర్యలు తీసుకున్నామన్నారు. మరో బ్యాంకు అకౌంటు వివరాలు ఇచ్చి రకరకాల సాకులు చెబుతూ మొత్తం రూ.11.76 లక్షలు తీసుకున్నారు. చివరకు విషయం సైబర్ క్రైమ్ పోలీసులకు చేరడంతో ఢిల్లీకి చెందిన సంజయ్ కుమార్, నవీన్ కుమార్ కటకటాల్లోకి చేరారు.
 
 

Advertisement
Advertisement