యువకుడి మృతికి కారణమైన పెట్రోల్ బంక్ వివాదం | Sakshi
Sakshi News home page

యువకుడి మృతికి కారణమైన పెట్రోల్ బంక్ వివాదం

Published Sun, Jul 19 2015 3:11 AM

యువకుడి మృతికి కారణమైన పెట్రోల్ బంక్ వివాదం - Sakshi

రోడ్డు దాటే క్రమంలో లారీ ఢీకొని దుర్మరణం
 
 చాంద్రాయణగుట్ట : పెట్రోల్ బంక్‌లో జరిగిన ఓ వివాదం యువకుడిని బలి తీసుకుంది. గొడవ అనంతరం రోడ్డు దాటుతున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం... జంగమ్మెట్ రవీంద్రనాయక్‌నగర్‌కు చెందిన కేత్లావత్ వినోద్(20) జీహెచ్‌ఎంసీలో డ్రైవర్. శుక్రవారం రాత్రి 10.30కి రవీంద్రనాయక్‌నగర్‌కు చెందిన మహేష్ నాయక్, బలరాం నాయక్ పెట్రోల్ పోయించుకునేందుకు బైక్‌పై చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ పంప్‌కు వచ్చారు. పెట్రోల్ పోసే సమయంలో తక్కువ పోశారంటూ ఇద్దరు యువకులు బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో రవీంద్రనాయక్‌నగర్ నుంచి కిరణ్‌తో పాటు మరికొందరు యువకులు చేరుకున్నారు.

గొడవ విషయం తెలిసి డ్రైవర్ వినోద్ కూడా బంక్ వద్దకు వచ్చాడు. అయితే, గొడవపై సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వచ్చి యువకులను సముదాయించి అక్కడి నుంచి పంపేశారు. దీంతో రోడ్డు దాటుతూ వినోద్ కింద పడిపోయాడు.  అదే సమయంలో అటుగా వస్తున్న లారీ (ఏపీ 13డబ్ల్యూ6610) అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అక్కడి పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎన్.రామారావు రవీంద్రనాయక్‌నగర్ బస్తీవాసులను అక్కడి నుంచి పంపేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా వినోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం శనివారం అతని స్వస్థలమైన మహబూబ్‌నగర్ జిల్లా మైసిగండికి తరలించారు.  ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు పెట్రోల్ బంక్‌ను మూసి వేయించి బందోబస్తును ఏర్పాటు చేశారు.

 ఠాణా ముందు బస్తీవాసుల ఆందోళన
 పెట్రోల్ బంక్ నిర్వాహకులు గూండాలతో కలిసి తమ బస్తీకి చెందిన యువకుడిని తరమడంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరిగెత్తే క్రమంలోనే లారీ కింద పడి మృతి చెందాడంటూ రవీంద్రనాయక్‌నగర్ బస్తీకి చెందిన యువకులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.  మహిళలు, యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ తక్కువ పోస్తావా..? అని అడిగినందుకు దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

దాదాపు 30-40 మంది గూండాలు పెట్రోల్ బంక్‌కు వచ్చిన యువకులపై దాడి చేశారని, వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే వినోద్ ప్రమాదానికి గురయ్యాడన్నారు. ఈ ఘటనకు కారకులైన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎన్.రామరావు, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణలు యువకులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement