ఇక వ్యవసాయానికి వేపపూత యూరియా | Sakshi
Sakshi News home page

ఇక వ్యవసాయానికి వేపపూత యూరియా

Published Wed, May 25 2016 4:03 AM

ఇక వ్యవసాయానికి వేపపూత యూరియా - Sakshi

- ఇప్పటికే 4.59 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసిన కేంద్రం
- 50 కిలోల బస్తా ధర సాధారణ యూరియా కంటే రూ.14.50 అధికం
అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటున్న రైతులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇక వేపనూనె పూత(నీమ్ కోటెడ్)తో తయారు చేసిన యూరి యానే రైతులకు అందుబాటులోకి రానుంది. వచ్చే ఖరీఫ్ కోసం రాష్ట్రానికి కేంద్రం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, ఇప్పటి వరకు 4.59 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరింది. ఇదంతా నీమ్ కోటెడ్ యూరియానే కావడం గమనార్హం. నీమ్‌కోటెడ్ యూరియా వల్ల రైతులకు మరింత మేలు కలుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణ యూరియా వేయగానే వేగంగా కరిగిపోతుందని, నీమ్ కోటెడ్ యూరియా ఆలస్యంగా కరిగి మొక్కలు మరింత బలంగా ఉండేందుకు సాయపడుతుం దని రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు ‘సాక్షి’కి తెలిపారు.

 అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే...
 కేంద్ర ప్రభుత్వం యూరియాకు సగం సబ్సిడీ ఇస్తుండడంతో దానిని అక్రమార్కులు పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తున్నారు. పక్కదారి పట్టకుం డా చెక్‌పెట్టడం కోసం గత ఏడాది నూతన యూరియా విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం రసాయన కర్మాగారాలు దేశవ్యాప్తంగా 50 లక్షల టన్నుల సాధారణ యూరియాను కాజేస్తూ ప్రతీ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్ల సబ్సిడీని కొల్లగొడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ అంచనా. అక్రమార్కులు పాలను కల్తీ చేయడానికి సాధారణ యూరియాను వినియోగిస్తున్నారు. దీంతో గతంలో రాష్ట్రానికి సరఫరా అయిన యూరియా లో దాదాపు 50 వేల మెట్రిక్ టన్నులు పక్కదారి పట్టింది.

యూరియా కొరత కారణంగా రైతులు తరచూ రోడ్డు ఎక్కాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కేవలం వ్యవసాయ అవసరాలకే తప్ప పరిశ్రమలకు ఉపయోగించడానికి వీలుపడని నీమ్ కోటెడ్ యూరియాను రైతులకు సరఫరా చేయనుంది. సాధారణ సబ్సిడీ యూరియా 50 కిలోల బస్తా రూ.283.50 కాగా, నీమ్ కోటెడ్ సబ్సిడీ యూరియా బస్తా రూ.298 ఉంది. రూ.14.50 అధికం. దీంతో తక్కువ మోతాదులో యూరియా అవసరమయ్యే చిన్న, సన్నకారులకు ఇది కాస్త భారమే. ఈ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement