బ్యాంకర్ల మీటింగ్‌ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్‌

20 Aug, 2017 04:07 IST|Sakshi
బ్యాంకర్ల మీటింగ్‌ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్‌

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  రైతు రుణాలు, సహాయం చేయడానికి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించని ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ ఒక్కరేనని మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని, అది కేంద్రం బాధ్యత అంటూ చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎకరానికి రూ.4 వేలను ఈ ఖరీఫ్‌ నుంచే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రైతు సమస్యలను దృష్టి మళ్లించడానికే సమగ్ర భూ సర్వే అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మండలానికి ఒక్క సర్వేయర్‌ కూడా దిక్కు లేరని, ఇక సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదని, కనీసం రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా కేవలం మాటలతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు