జగన్ బాట..జనం మాట | Sakshi
Sakshi News home page

జగన్ బాట..జనం మాట

Published Sun, Oct 27 2013 4:45 AM

The path to the crowd's ..

అఫ్జల్‌గంజ్/దత్తాత్రేయనగర్/కలెక్టరేట్/బషీర్‌బాగ్/దారుషిఫా,న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా జనం హాజరయ్యారు. భారీవర్షాలను కూడా లెక్కచేయకుండా రైళ్లు,ప్రత్యేక బస్సుల్లో నగరానికి తరలివచ్చారు. దీంతో శనివారం ఉదయం 9 నుంచే బషీర్‌బాగ్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 1గంటకే ఎల్‌బీస్టేడియం జనంతో నిండిపోయింది. దీంతో పోలీసులు లోపలికి ఎవరినీ అనుమతించలేదు.

పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం వినేందుకు వర్షాన్ని సైతం ఖాతరు చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు అధిగమించి ఇక్కడికొస్తే పోలీసులు తమను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని గుంటూరు,ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు మహిళలు, అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ గేటు వద్ద పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి..
 విభజన వాదంతో కొందరు నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నారు. విభజన యత్నాలు మానుకోవాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి .  
 -గణోదమ్మ, తోట్లవల్లూరు, కృష్ణాజిల్లా
 
 సమైక్యాంధ్రకే మా మద్దతు..
 ఆంధ్రప్రదేశ్‌ను కొందరు స్వార్థం కోసం విడదీయాలనుకుంటున్నారు. విభజన వల్ల కోస్తా,రాయలసీమ జిల్లాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని, మా పిల్లలు చెబుతున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మేమంతా మద్దతు నిలుస్తాం.    
 -మమతారెడ్డి,నల్గొండ జిల్లా
 మైనార్టీల కోసం ఎంతో చేశారు..
 వైఎస్సార్ మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ముస్లింలు విద్య,ఉపాధి రంగాల్లో రా ణిస్తున్నారు. ఆయనపై ఉన్న అభిమానంతోనే శం ఖారావానికి వచ్చాను.
 - నుజద్ పర్విన్, పాతబస్తీ
 
 వెళ్లిపొమ్మంటే ఎలా..?
 కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఇప్పుడు సీ మాంధ్రులు వెనక్కి వెళ్లిపోవాల్సిందే అంటే ఎక్కడికి వెళ్లిపోతాం? ఉద్యోగావకాశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే రా ష్ట్రం సమైక్యంగా ఉండాలి. జగన్ సమైక్య శంఖారా వం సభ నిర్వహించడం మంచి విషయం. ఆ యన ఇంకా గట్టిగా పోరాడాలి.
 -మాలతీరెడ్డి, దిల్‌సుఖ్‌నగర్
 
 రాజధాని అనే వచ్చాం..
 మేం కాదు..రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఎంతోమం ది హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాజధాని అనే ఇక్కడికొచ్చారు. ఇక్కడ తప్ప రాష్ట్రంలో ఎక్కడా సరైన ఉద్యోగావకాశాలు ఉన్నాయా? ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొడితే, మేమంతా ఎక్కడికి వెళ్లాలి..?
 - శ్రీదేవి, భీమవరం, ప.గో.జిల్లా
 
 సోనియాను బాగానే అడిగారు..
 సభలో జగన్ సోనియాను మంచిప్రశ్న అడిగారు. 30ఏళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్న సోనియాను ఆమె దేశం వెళ్లిపొమ్మంటే బాధ కలగదా అని ప్రశ్నించడం సబబే. ఎన్నాళ్ల నుంచో హైదరాబాద్‌తో మమేకమయ్యాం. రాష్ట్ర విభజన తర్వాత భయంగా బతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
 - బి.అనిత, నెల్లూరు జిల్లా
 స్టేడియం సరిపోలేదు..
 సభ కోసం శుక్రవారం రాత్రి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైల్లో నగరానికి వచ్చాం. సభ ప్రారంభం కాకముందే స్టేడియానికి చేరుకున్నా అప్పటికే నిండిపోయింది. పోలీసులు అనుమతించకపోవడంతో ఎల్‌సీడీలో సభను వీక్షించాం.
 -బాబురెడ్డి, చిత్తూరు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు  
 
 పాసులున్నా లోపలికి పంపలేదు..
 ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి 55 మంది మహిళలతో ఇక్కడికొచ్చాం. మధ్యాహ్నం 1గంటకే స్టేడియానికి చేరుకోగా అప్పటికే నిండిపోయిందని పోలీసులు లోపలికి అనుమతించలేదు. పాసులున్నప్పటికీ అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.     
 - యజ్దాని సూరజ్, మైనార్టీ విభాగం నేత, ప్రకాశం జిల్లా
 
 సభ సక్సెస్ సంతోషాన్నిచ్చింది..
 సభలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రే కడప జిల్లా వీరపల్లి మండలం మట్టిరెడ్డివారిపల్లి నుంచి బయల్దేరాం. స్టేడియం నిండిపోవడంతో లోపలికెళ్లలేక టీవీల్లో చూశాం. సభ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.    
     -గోపీనాథ్, కడప జిల్లా
 
 పెద్దాయిన ఉన్నప్పుడు ఏ గొడవా లేదు..
 పెద్దాయన ఉన్నప్పుడు అందరికీ మంచి చేసినాడు. అందుకే ఏ కొట్లాట లూ లేవు. ఇప్పుడు రాష్ట్రంలో నాయకుడే లేకుండా పోయినాడు. అందుకే తెలంగాణ కావాలని అడుగుతున్నా రు. జగనన్న సీఎం అయితే అంతా కుదురుకుంటాది. -గాయత్రి,ఇప్పట్ల,పులివెందుల,కడపజిల్లా
 
 జగన్‌ను చూడటానికే వచ్చా..
 16 నెలల అనంతరం జగన్‌ను చూడటానికి ఇక్కడికి వచ్చాను. సమైక్యాంధ్ర కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
 -శ్వేతారెడ్డి, రంగారెడ్డి జిల్లా
 
 అన్ని పార్టీలు నమ్మకం కోల్పోయాయి..
 ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. జగన్ సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఆయ న చేస్తున్న ఉద్యమానికి తమవంతు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను.     
 -అమృతసాగర్, మెదక్‌జిల్లా
 
 రాష్ట్రం ఎడారి కాకుండా..
 జగన్‌గారు పూరించిన సమైక్య శంఖారావానికి మద్దతుగా నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాల కారణంగా ఎన్నో ఇబ్బందులున్నా సభకు హాజరయ్యాం. సమైక్యాంధ్ర కోసం పాటుపడదామన్న ఆయనకి అందరం అండగా ఉంటాం. రాష్ట్రాన్ని ఎడారి కాకుండా కాపాడడం జగన్‌తోనే సాధ్యం.
     - ఎం. వెంకటేశ్వర్లు, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా
 
 తెలంగాణ ప్రజల్లో కూడా సమైక్యవాదం
 సీమాంధ్ర ప్రజలతో పాటు తెలంగాణలో కూడా ఎంతోమంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా సమైక్యవాదం ఉందనేందుకు జగన్‌గారు పూరించిన సమైక్య శంఖారావం సభ విజయవంతం కావడమే నిదర్శనం.  
 - షేక్‌బాజీ, దుగ్గిరాల, గుంటూరు జిల్లా
 
 సభ విజయవంతమైంది..
 ఏదో ఒక ప్రాంతమే అభివృద్ధి చెందితే సరిపోదు. రాష్ట్రంలోని మూడు ప్రాం తాలు అభివృద్ధి చెందాలని జగన్‌గారు చెప్పిన మాటలు నమ్మకం కలి గించాయి. ఆయన సీఎం అయితేనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమౌతుంది. తెలుగు ప్రజలందరూ కలిసుండాలని సంకల్పంతో నిర్వహించిన సమైక్య శంఖారావం సభ విజయవంతమైంది.     
 - రాంబాబు, పిండిప్రోలు, ఖమ్మం జిల్లా
 
 108 అధ్వానంగా తయారైంది..
 దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి గారి హయాంలో ప్రారంభమైన 108 సర్వీసులు ప్రజలకు మెరుగైన సేవలందించాయి. ఆయన మరణానంతరం 108 వ్యవస్థతో పాటు, ఉద్యోగుల జీవితాలు అధ్వానంగా తయారయ్యాయి. జగనన్న సీఎం అయితేనే మా జీవితాలు బాగుపడతాయి.     
 - రాంబాబు, 108 ఉద్యోగి, కర్నూలు
 
 వాగులు పొంగుతున్నా వచ్చా
 నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. అయినా ప్రకాశం జిల్లా నుంచి వచ్చా. కాస్త ఆలస్యం కావడంతో లోనికి రాలేకపోయా. బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై నుంచే జగనన్న ప్రసంగాన్ని తిలకించా.    
 - కుమార్, తాపీమేస్త్రీ, కంభం, ప్రకాశం జిల్లా
 
 వర్షం ఆపలేకపోయింది..
 అవిటితనం అడ్డుకాలేదు..భారీవర్షాలు ఆమెను నిలపలేకపోయింది. కుండపోత వాన కూడా ఆమెస్థైర్యాన్ని చూసి చిన్నబోయింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన జయమ్మ సమైక్యశంఖారావం సభకు రెండురోజుల ముందే బయల్దేరింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో తనకు వికలాంగుల పింఛన్ పెరిగిందని, అది జీవితంపై భరోసా పెంచిందని కన్నీళ్ల పర్యంతమైంది.     
  - జయమ్మ, వికలాంగురాలు, శ్రీకాకుళం జిల్లా
 
 జగనన్నను చూద్దామని వచ్చా...
 జగనన్నను చూసి ఎన్నాళ్లయిందో. ఆయన్ను చూద్దామనే మాచర్ల నుంచి హైదరాబాద్ మీటింగ్‌కి వచ్చాం. తెలంగాణ, సీమాంధ్ర వాళ్లు అన్నదమ్ముల్లా కలిసుందామని జగనన్న చెప్పారు.  
 - ధనలక్ష్మి, మాచర్ల, గుంటూరు జిల్లా
 

Advertisement
Advertisement