‘ప్లాస్టిక్’కు జీవం పోసేదెప్పుడో? | Sakshi
Sakshi News home page

‘ప్లాస్టిక్’కు జీవం పోసేదెప్పుడో?

Published Fri, May 6 2016 1:24 AM

‘ప్లాస్టిక్’కు జీవం పోసేదెప్పుడో? - Sakshi

* ప్రతిపాదన దశ దాటని ‘మెగా ప్లాస్టిక్ పార్కు’
* వివాదాలతో రెండేళ్లుగా కొలిక్కిరాని భూసేకరణ
* ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలతో ప్లాస్టిక్‌కు డిమాండ్
* ఆచరణకు నోచుకోని హైదరాబాద్ సిపెట్ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్: మెగా ప్లాస్టిక్ పార్కు... ప్లాస్టిక్ పరిశ్రమకు మరింత జీవం పోయడం దీని ఉద్దేశం. హైదరాబాద్ పరిసరాల్లో ఈ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పార్కులో మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు డిజైన్ల తయారీ వంటి సాంకేతిక అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో పనిచేస్తామని కేంద్రం రెండేళ్ల క్రితం ప్రకటించింది.

కానీ, దీని ఏర్పాటుకు భూసేకరణ అవరోధంగా నిలిచింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రంగారెడ్డి జిల్లా మంకాల్‌లో పార్కు ఏర్పాటుకు 170 ఎకరాల స్థలాన్ని పరిశ్రమల శాఖ గుర్తించింది. అయితే, ఇందులో 30 ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులున్నాయి. దీంతో మిగిలిన 140 ఎకరాలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు కనీసం 250 ఎకరాలు కావాలని ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
 
ఆన్‌లైన్ వాణిజ్యంతో పెరిగిన డిమాండ్
రాష్ట్రంలో అమెజాన్, ఐకియా వంటి ఆన్‌లైన్ వాణిజ్య సంస్థల కార్యకలాపాలు ఊపందుకుంటుండటంతో ప్యాకేజింగ్ మెటీరియల్, మరీ ముఖ్యంగా ప్లాస్టిక్‌కు గిరాకీ పెరుగుతుందని అంచనా. అమెజాన్ వంటి సంస్థలు ముంబై, దమన్ నుంచి ప్యాకింగ్ మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. స్థానికంగా ప్లాస్టిక్ పరిశ్రమను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అయితే పరిశ్రమల స్థాపన, సాంకేతికంగా ఆధునిక హంగులు సమకూర్చుకోవడంలో బ్యాంకర్లు సహకరించడం లేదని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
 
ఆచరణలోకి రాని సిపెట్
దేశంలోనే అతి పెద్ద ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా రూపుదాల్చలేదు. మెదక్ జిల్లా రుద్రారంలో ఇండో ఫ్లోరో కార్బన్ (ఐఎఫ్‌సీ)కు చెందిన 20 ఎకరాల స్థలాన్ని రూ.50 కోట్లు చెల్లించి కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఇందులో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఏర్పాటు చేసి, ఏటా ఐదు వేల మందికి శిక్షణ ఇస్తామని కూడా పేర్కొన్నది. కానీ ఈ అంశం ప్రతిపాదన దశను దాటడంలేదు.
 
ప్లాస్టిక్ పరిశ్రమ స్థితి ఇదీ..
* ప్రస్తుతం రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమ ద్వారా ఏటా సుమారు రూ.1,500 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి
* హైదరాబాద్ పరిసర జిల్లాలు మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి పరిధిలోనే ఎనిమిది వేలకుపైగా ప్లాస్టిక్ పరిశ్రమలు
* వీటిలో 80 శాతం మేర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు
* సుమారు 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నట్లు తెలంగాణ వాణిజ్య మండలి (ఫ్టాప్సీ) లెక్క.

Advertisement
Advertisement