ఆగమేఘాలపై ఆర్డినెన్స్ | Sakshi
Sakshi News home page

ఆగమేఘాలపై ఆర్డినెన్స్

Published Mon, Oct 24 2016 1:31 AM

ఆగమేఘాలపై ఆర్డినెన్స్ - Sakshi

- ఏపీఐడీఈ చట్టంలో రాష్ట్ర సర్కారు సవరణలు
- సెలవు రోజు చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీ
- సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర
- అథారిటీకి అధికారాలు కల్పించే సెక్షన్లన్నీ తొలగింపు
- స్విస్ చాలెంజ్ ప్రాజెక్టులను ఆమోదించే అధికారం ఇక అథారిటీకి లేదు
- ఆసక్తి ఉన్నవారు కాదు... అర్హత ఉన్నవారే స్విస్ చాలెంజ్‌లో పాల్గొనాలి
- సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చర్యలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తన తాబేదారు కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్(ఏపీఐడీఈ) చట్టాన్నే మార్చేశారు. స్వప్రయోజనాలను కాపాడుకోవడంలో క్షణమైనా ఆలస్యం జరగకూడదన్న ఉద్దేశంతో ఆదివారం ఆఘమేఘాలపై ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న విలువైన భూములను స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి కట్టబెట్టడానికి సీఎం ఏకంగా స్విస్ చాలెంజ్ చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుత చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. దానికి అధికారాలను కల్పించే సెక్షన్ 2 (ఎఫ్‌ఎఫ్)ను సవరణతోతొలగించారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం ఈ సవరణలను ఆమోదించగా, ఆదివారం ఏపీఐడీఈ చట్ట సవరణ-2016 ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

 చట్ట సవరణల్లోని ముఖ్యాంశాలు
 ప్రస్తుతం చట్టంలోని నిబంధన మేరకు స్విస్ చాలెంజ్‌లో ఏ కంపెనీలైనా తమంతట తాముగా సమర్పించిన ప్రతిపాదనలను తొలుత స్థానిక సంస్థ అయిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిశీలించాలి. అక్కడి నుంచి సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి వెళ్లాలి. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. అయితే, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు తొలుత సీఆర్‌డీఏకి వెళ్లిన అనంతరం మంత్రులతో కూడిన హైపవర్ కమిటీకి, ఆ తరువాత సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాయి. ఆయన ఆమోదించిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరాయి. ఈ విషయాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర తీర్పులో తప్పుపట్టారు. చట్టాన్ని ఉల్లంఘించారని ఆక్షేపించారు.

ఇప్పుడు ఆర్డినెన్స్  ద్వారా చేసిన చట్ట సవరణలో సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అనే పదం గల సెక్షన్‌ను తొలగించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలులో సలహాలు, సూచనలు, సిఫార్సులు చేసే అధికారాలను అథారిటీకి లేకుండా చట్టాన్ని సవరించారు. డెవలపర్ అవకతవకలకు పాల్పడితే చార్జీలు వసూలు చేసే అధికారం అథారిటీకి ఉండేది.  దాన్నీ తొలగించేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి ప్రస్తుత చట్టంలో పలు సెక్షన్ల ద్వారా అధికారాలున్నాయి. ఆ సెక్షననూ ఆర్డినెన్స్  ద్వారా తొలగించేశారు. డెవలపర్ రెవెన్యూ వాటా కూడా చెప్పాల్సిన అవసరం లేదని సవరణ చేశారు.ఇన్‌ఫ్రాస్ట్రర్ అథారిటీ దగ్గర ఏమైనా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ అథారిటీ నుంచి ఆమోదం పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆమోదించే అధికారాలను అథారిటీ నుంచి తప్పించారు. ఆసక్తి గల వారందరూ స్విస్ చాలెంజ్‌లో పాల్గొనవచ్చని చట్టంలో ఉండగా దాన్ని తొలగించి, అర్హత ఉన్నవారే పాల్గొనాలనే సవరణ చేశారు. మొత్తం మీద ప్రభుత్వ పెద్దలు తమ ఇష్టానుసారంగా స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టంలో సవరణలు చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  
 
 ఇక పెత్తనమంతా ప్రభుత్వానిదే
 స్విస్ చాలెంజ్ ముసుగులో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1,691 ఎకరాలను నామినేషన్‌పై ధారాదత్తం చేసేందుకు ఏపీఐడీఈ చట్టం కింద ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టంలోని నియమ నిబంధనలను, పలు సెక్షన్లను తుంగలో తొక్కి సింగపూర్ ప్రైవేట్ కంపెనీల లబ్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగానే.. స్విస్ చాలెంజ్‌కు ప్రాతిపదికైన ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వం సవరణలు తెస్తుండడాన్ని ‘సాక్షి’ ఇంతకు ముందే తెలియజేసింది. ఆదివారం జారీ చేసిన ఆర్డినెన్స్‌లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖల కార్యదర్శుల సభ్యులుగా ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర వేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అనే పేరును తొలగించేసి, దాని స్థానంలో ప్రభుత్వం అనే పదాన్ని ఆర్డినెన్స్‌లో చేర్చారు.

Advertisement
Advertisement