థియేటర్ ఫన్‌డుగ | Sakshi
Sakshi News home page

థియేటర్ ఫన్‌డుగ

Published Tue, Feb 3 2015 11:45 PM

థియేటర్ ఫన్‌డుగ - Sakshi

పిల్లలు... స్మార్ట్‌ఫోన్స్, కార్టూన్ నెట్‌వర్క్స్, వీడియోగేమ్స్‌కు అతుక్కుపోయిన కాలం ఇది. అడపాదడపా సినిమాలూ ఉండనే ఉన్నాయి. ఈ రెగ్యులర్ యాక్టివిటీస్‌కి దూరంగా పిల్లలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది అస్సితేజ్ ఇండియా. చిన్నారులను నాటకాలవైపు ఆకర్షించే లక్ష్యంతో హైదరాబాద్‌లో రెండో అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ ఫర్ యంగ్ ఆడియన్స్ నిర్వహిస్తున్నది. మంగళవారం ప్రారంభమైన ఈ నాటకోత్సవం మూడురోజులపాటు పిల్లలకు పండుగ చేయనుంది!
 ..::  కోన సుధాకర్‌రెడ్డి
 
 అస్సితేజ్... 1965లో చిన్నారుల కోసం ఏర్పాటైన ఇంటర్నేషనల్ థియేటర్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువత కోసం నాటకాలను ప్రదర్శిస్తున్న సంస్థలు, వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేస్తున్న సంస్థ. పిల్లల ప్రపంచం పిల్లలకు ఉంటుంది. వారిని భాగస్వామ్యం చేస్తూ థియేటర్స్ గేమ్స్, కొరియోగ్రఫీ, కథలు చెప్పటం, ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ నాటకాలు ప్రదర్శిస్తారు. ఇవన్నీ పూర్తిగా పిల్లల స్థాయిలోనే, వారికి అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి. వారిలో కళాత్మకతను, మానవత్వాన్ని, విద్యా విలువలను పెంపొందిస్తాయి. రూపొందించింది పిల్లల కోసమే అయినా.. నాటకాలు ప్రదర్శించేది పెద్ద ఆర్టిస్టులే.
 
 ఏకకాలంలో...
 2004నుంచి భారత్ అస్సితేజ్‌లో భాగస్వామి అయింది. భారత్‌కు చెందిన ఏడు బృందాలు ఇందులో పనిచేస్తున్నాయి. ఈ పదేళ్లలో అనేక సెమినార్లు, ఉత్సవాలను నిర్వహించిందీ సంస్థ. హెచ్‌సీయూ కేంద్రంగా... చిన్నపిల్లల నాటకాలపై వర్క్ జరుగుతోంది. చిల్డ్రన్స్ డే రోజున కూడా జరిగిన ఫెస్టివల్‌లో మూడు నాటకాలు ప్రదర్శించారు. ఫిబ్రవరి 1న దిల్లీలో నాటకోత్సవం ప్రారంభమైంది. ఏకకాలంలో దిల్లీ, హైదరాబాద్ నగరాల్లో థియేటర్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగరంలోనే ప్రధానమైన థియేటర్ ఫెస్టివల్ నిర్వహించాలని భావిస్తోంది అస్సితేజ్. ఇందులో 12 నాటకాలను ప్రదర్శించనున్నారు.
 
 కంటెంట్ ఉంటే కచ్చితంగా...
 ‘పిల్లల కోసం నాటకాలు వేయడం ఒక ఛాలెంజ్. అందులో తృప్తి ఉంది. భవిష్యత్‌లో పిల్లలకు థియేటర్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సినిమాలు ఓకే కానీ... నాటకాలు పిల్లలు చూస్తారా? అన్న సందేహం ఉంది. కథలో కంటెంట్ ఉంటే.. పిల్లలు కచ్చితంగా వస్తారు. వాళ్లు రావడమే కాదు తల్లిదండ్రులనూ తీసుకొస్తారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది’ అని అస్సితేజ్ ఇండియా సెక్రటరీ గరికపాటి ఉదయభాను అంటున్నారు.
 
 ఈరోజు ‘స్పాట్’...
 స్పాట్.. . 40 నిమిషాల నిడివి ఉన్న ఇటలీ ప్లే ఇది. కలర్ లైట్స్‌తో నేలపై విభిన్న ఆకారాలను సృష్టిస్తూ, పిల్లలకు వింత అనుభూతి కలిగిస్తూ సాగే  ఈ నాటకాన్ని ఇద్దరు ఆర్టిస్టులు ప్రదర్శిస్తారు. నాటకం ఇంగ్లిష్‌లో ఉంటుంది. విద్యారణ్య స్కూల్‌తోపాటు, పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోనూ ప్రద ర్శించనున్నారు. విద్యార్థుల కోసం ఉదయం 9.30 నిమిషాలకు, 11.30కి ప్రదర్శితమవుతుంది. సాయంత్రం ఏడుగంటలకు పబ్లిక్ షో. పిల్లలతోపాటు పెద్దలకూ ప్రవేశం ఉంటుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement