పోలీసుల సాక్షిగా దొంగతనం.. | Sakshi
Sakshi News home page

పోలీసుల సాక్షిగా దొంగతనం..

Published Tue, Apr 28 2015 12:43 AM

Theft by the police .. in hyderabad

హైదరాబాద్ సిటీ: పోలీస్ స్టేషన్ పక్కనే పోలీసుల సాక్షిగా ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడ్డారు. కష్టపడి దొంగిలించిన సొమ్ము ఎందుకు పారేసుకుంటవు అని ఓ మహిళతో మాయమాటలు చెప్పి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకె ళ్లారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్చమ్మ(60) లంగర్‌హౌస్ హరిదాస్‌పురాలో నివాసముంటుంది. ఈమె రెండు రోజుల క్రితం చార్మినార్‌లో కొన్న చీరను ఎక్స్చేంజ్‌ చేయడానికి సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరింది.


ఆటో కోసం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పక్కన నిలబడగా ఓ మహిళ ఈమె వద్దకు వచ్చి నా పర్సు పోయింది నీకు దొరికిందా అంటూ ఏడుస్తూ అడిగింది. తనకు తెలియదని అర్చమ్మ చెప్పడంతో అనుమానం ఉందంటూ ఆ మహిళ అర్చమ్మ బ్యాగులో తనిఖీ చేసి ఏమీ కనిపించకపోవడంతో వెళ్లిపోయింది. అనంతరం మరో మహిళ వెనక నుంచి అర్చమ్మ వద్దకు వచ్చి తనకు బ్యాగు దొరికిందని అర్చమ్మతో చెప్పింది. ఈ బ్యాగు మరో మహిళ వద్ద దొంగిలిస్తుండగా చూశానని అర్చమ్మను బెదిరించింది. దీంతో ఆమె భయపడగా ఏడవక దొంగిలించిన సొమ్ము తమకు ఎందుకు నువ్వే తీసుకో అని అర్చమ్మ చేతిలో ఓ పర్సు పెట్టింది. పర్సులో ఏముందని ఆ మహిళ తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఆ పర్సులో నుంచి బంగారు పూత ఉన్న కడ్డీని తీసింది. ఇంత బంగారాన్ని దొంగిలిస్తావా అని ఆమె మరో సారి అర్చమ్మను బెదిరించి పోలీసులకు అప్పజెబుతా అని భయపెట్టింది.

బంగారు కడ్డీ తీసుకొని మెడలోని చిన్న గొలుసు తనకు ఇస్తే వెళ్లిపోతానని చెప్పింది. ఆ కడ్డీ నిజమైన బంగారమని నమ్మిన ఆమె తన బంగారు గొలుసును ఆ మహిళకు ఇచ్చి కడ్డీతో ఇంటికి వెళ్లింది. అనంతరం ఓ జ్యువెల్లరీ దుకాణంలో పరీక్ష చేయించగా అది బంగారు కడ్డీ కాదని తేలడంతో ఆమె సోమవారం రాత్రి లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ గేటు ముందు పోలీసుల సాక్షిగా ఆ మహిళలు ఈ దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు.
(లంగర్‌హౌస్)

Advertisement
Advertisement